
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్కూల్ అసిస్టెంట్(ఎస్ఏ) ప్రమోషన్లకు టెట్ తప్పనిసరి అని హైకోర్టు స్పష్టం చేసింది. ఎస్జీటీ క్యాడర్ నుంచి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ పొందాలంటే టెట్ పేపర్–2 క్వాలిఫై కావాల్సిందేనని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఎస్జీటీ నుంచి ఎస్ఏ ప్రమోషన్ పొందేందుకు రెడీ చేసిన సీనియార్టీ లిస్టులో ఎన్సీటీఈ నిబంధనలు అమలు చేయలేదని పలువురు టీచర్లు హైకోర్టును ఆశ్రయించారు.
పిటిషనర్ల తరఫున అడ్వకేట్లు రాహుల్ రెడ్డి, అరుణ్ వాదనలు వినిపించారు. ఎన్సీఈటీ నిబంధనల ప్రకారం స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లకూ టెట్–2 అర్హత తప్పనిసరి అని కోర్టుకు విన్నవించారు. ఈ అంశంపై ఇదివరకే మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చినట్లు గుర్తుచేశారు. పిటిషనర్ల తరఫున వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లకు టెట్ పేపర్ 2 క్వాలిఫై తప్పనిసరి అని పేర్కొన్నది. వాస్తవానికి 2010 నుంచే ఈ విధానం అమలు చేయాల్సి ఉన్నా ముందుగా ఐదేండ్లు , ఆ తర్వాత రెండేండ్లు ప్రత్యేక అనుమతితో ప్రమోషన్లు ఇచ్చారు. ప్రస్తుతం ఆ గడువు ముగియడంతో టెట్ క్వాలిఫై అంశం తెరమీదికి వచ్చింది.
తీర్పును పునర్ సమీక్షించాలె
స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై ఉండాలనడం విచారకరమని..హైకోర్టు తన తీర్పును పునర్ సమీక్షించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, కార్యదర్శి చావ రవి కోరారు. 2010 కంటే ముందు సర్వీస్ లో చేరిన వారికి టెట్ అర్హత మినహాయించారని తెలిపారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎంపికైన వారికి మాత్రమే తప్పనిసరి చేశారని గుర్తుచేశారు. దీంతో సర్వీస్‌లో ఉన్న టీచర్లు ఏనాడూ టెట్ రాయలేదని వెల్లడించారు.
కాగా..హైకోర్టు మధ్యంతర తీర్పు ప్రకారం.. టెట్ క్వాలిఫై అయిన ఎస్జీటీలకు మాత్రమే స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లు ఇవ్వాలని టెట్ అభ్యర్థుల ప్రమోషన్ల సాధన సమితి ప్రతినిధులు ప్రవీణ్ కుమార్, రేవంత్ కుమార్, పవన్, శ్రీకాంత్ తదితరులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.