ఇన్ సర్వీసు టీచర్లకు టెట్ సంకటం

ఇన్ సర్వీసు టీచర్లకు టెట్ సంకటం

నాణ్యమైన విద్య అందించడం ఉపాధ్యాయుల బోధన  నైపుణ్యాలపై ఆధారపడి ఉంటుంది.  మంచి నైపుణ్యాలు ఉన్న ప్రతిభగల ఉపాధ్యాయుల బోధనలో  మెరికలలాంటి విద్యార్థులు రూపొందుతారు.  డైట్, బీఈడీ కళాశాలల్లో తరగతి గది బోధన,  పాఠశాల నిర్వహణ, పాఠ్యప్రణాళిక రూపకల్పన ,  సమకాలీన విద్యా సమస్యలు మొదలైన ఉపాధ్యాయ వృత్తి నైపుణ్యాలను డీ.ఎడ్,  బీ.ఎడ్ విద్యార్థులు అభ్యసిస్తారు. ఈ కోర్సులను అందించడానికి  దేశవ్యాప్తంగా ప్రభుత్వ యాజమాన్యంలో,  ప్రైవేటు రంగాలలో డైట్, బీఈడీ కళాశాలలు ఉన్నాయి. మూడు దశాబ్దాలుగా విద్యారంగంలో ప్రైవేటు యాజమాన్యాల ప్రవేశం పెరిగింది. 

ఫలితంగా ప్రైవేటు రంగంలో  బీఈడీ, డీఈడీ  కోర్సులను అభ్యసించిన ఉపాధ్యాయుల్లో  నైపుణ్యాలు కొరవడుతున్నాయని విద్యా నిపుణులు చెప్తున్నారు.  ప్రభుత్వ రంగంలోని డైట్,  బీఈడీ  కళాశాలల్లో కూడా అధ్యాపకుల  కొరతతో  ఉపాధ్యాయ శిక్షణ  నామమాత్రంగా ఉంటోంది. అందువలన భావి ఉపాధ్యాయులలో నైపుణ్యాలు లేకుండాపోతున్నాయి.  మన రాష్ట్రంలోని పది డైట్, నాలుగు విద్యా కళాశాలల్లో 90 శాతం అధ్యాపకుల ఖాళీలు ఉండటం గమనార్హం!

పాఠశాల విద్యలో  నాణ్యతకోసం విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 23 ద్వారా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను  నిర్దేశించింది. దీని ప్రకారం ఎన్ సిటిఇ 2011  జులై 29 నాడు ఒక నోటిఫికేషన్ ద్వారా టెట్ పరీక్షను తప్పనిసరి చేసింది.  ఈ  నోటిఫికేషన్  తర్వాత  నియామకమయ్యే ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్ అర్హత సాధించాలి.  పదోన్నతులకు కూడా టెట్ లో అర్హత సాధించాలి.  మోహినీ జైన్ (1992),  ఉన్నికృష్ణన్ (1993) కేసులలో సుప్రీంకోర్టు విద్యా హక్కు ఆర్టికల్ 21లో  జీవిత హక్కు  భాగంగా ఉంటుందని స్పష్టం చేసింది. ఈ  నేపథ్యంలో 2002లో  86వ  సవరణ ద్వారా  ఆర్టికల్ 21Aను  ప్రవేశపెట్టారు. 

 దాని ఫలితంగా ఆర్టికల్ 21Aను  అమలుపరిచేందుకు విద్యాహక్కు చట్టం 2009ను  రూపొందించారు.  విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 23 (1 )లో  ఉపాధ్యాయుల అర్హత పరీక్ష (టెట్)ను నిర్దేశించారు.  నియామకప్రక్రియలో జాతీయ ప్రమాణాలు, ఉపాధ్యాయులకు ప్రమాణాలను ఈ సెక్షన్ నిర్దేశిస్తుంది. దీనివలన ప్రభుత్వాలు,  విద్యాసంస్థల యాజమాన్యాలు ఉపాధ్యాయుల బోధన నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారని వివరించింది. విద్యాహక్కు చట్టం 2010 ఏప్రిల్ 1 నుంచి అమలులోనికి వచ్చింది. 

పదోన్నతికి టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి

ఉపాధ్యాయ అర్హత పరీక్షపై సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1 నాడు తీర్పు వెలువరించింది.   దీని ప్రకారం అన్ని రకాల కేడర్ ఉపాధ్యాయులు వచ్చే రెండు సంవత్సరాలలోపు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో ఉత్తీర్ణులు కావాలి. పదవీవిరమణకు దగ్గరలో ఉన్న, అంటే 55 సంవత్సరాలు పైబడిన ఉపాధ్యాయులు, వారు టెట్ అర్హత పరీక్షలో ఉత్తీర్ణులు కాకపోయినా ఉద్యోగంలో కొనసాగవచ్చు. కానీ పదోన్నతి కావాలంటే వారు వెంటనే టెట్ అర్హత పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. అన్ని రకాల కేడర్ల  ఉపాధ్యాయులు రెండు సంవత్సరాలలోపు అర్హత పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. పదోన్నతికి అర్హత పరీక్ష ఉత్తీర్ణత తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పదోన్నతి మాత్రమే కాకుండా ఉద్యోగంలో కొనసాగడానికి కూడా అర్హత పరీక్ష తప్పనిసరి అయింది. 

ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

ప్రస్తుత సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇరవై ఏండ్లపైబడి పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు టెట్‌‌ ఉత్తీర్ణత సాధించకపోతే ఉద్యోగం నుంచి తొలగించే పరిస్థితులు ఏర్పడినవి.  ఈ తీర్పు ప్రకారం రిటైర్‌‌మెంట్‌‌కు 5 సంవత్సరాలలోపు సర్వీసు ఉన్నవారికి టెట్‌‌ ఉత్తీర్ణత నుంచి మినహాయింపు ఇచ్చారు.  కానీ,  ప్రమోషన్‌‌ కావాలనుకుంటే టెట్‌‌ ఉత్తీర్ణత సాధించాలి. 5 సంవత్సరాల సర్వీసు మించి ఉన్న ఉపాధ్యాయులు అందరూ రెండేండ్లలోపు  టెట్‌‌ ఉత్తీర్ణత సాధించాలి.  లేనట్లయితే ఉద్యోగం నుంచి తప్పుకోవాలి అనే నిబంధనలు విధించారు.  విద్యారంగం,  ఉపాధ్యాయుల సంక్షేమం దృష్ట్యా, సహజ న్యాయం చేయడానికి  తెలంగాణ రాష్ట్ర
 ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. 

సుప్రీం కోర్టు తీర్పును  సవాలు చేస్తూ రివ్యూ పిటిషన్‌‌ వేయాలి.  జీవో ఎంఎస్ 36 తేదీ.16-–04–-2011,  జీవోఎం ఎస్ 36 తేదీ 23-–12-–2015 ప్రకారం 2010కు ముందు నియామకమై  పనిచేస్తున్న ఉపాధ్యాయులకు శాశ్వతంగా టెట్ పరీక్ష ఉత్తీర్ణత నుంచి మినహాయింపు ఇవ్వడానికి చట్టపరమైన అన్ని చర్యలు తీసుకోవాలి.  సీనియర్ ఉపాధ్యాయులకు సహజ న్యాయం జరిగేలా చూడాలి.  పాఠశాల విద్యాశాఖ టెట్​పై విధి విధానాలను రూపొందించాలి. సీనియర్ ఉపాధ్యాయులకు సహజ న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత విద్యాశాఖ తీసుకోవాలి. పాఠశాల విద్యావ్యవస్థలో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు ఎన్‌‌.సి.టి.ఇ. మార్గదర్శకాలను అమలు చేయాలి. 

ఉపాధ్యాయుల ఆందోళన

సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించి, ఉపాధ్యాయుల ప్రయోజనాలను కాపాడేలా నిర్ణయం తీసుకుంటామని ఒడిశా విద్యా మంత్రి తెలిపారు. టెట్ ప్రవేశపెట్టకముందే నియమితులైన ఉపాధ్యాయులకు ఒడిశా టెట్ అర్హత లేకపోవడంతో ఉద్యోగ భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.  సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రంలోని రెండు లక్షల మంది ఉపాధ్యాయులపై ప్రభావం చూపుతుందని తమిళనాడు  విద్యాశాఖ మంత్రి  అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో  మహారాష్ట్రలోని ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.  టెట్​లో ఉత్తీర్ణత శాతం చాలా తక్కువగా (2024లో 3.38% మాత్రమే) ఉన్నందున, పరీక్ష ప్రక్రియను సరళతరం చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. 

టెట్ తప్పనిసరిగా  ప్రతిఏటా రెండుసార్లు జరపాలని ఎన్ సిటిఇ నిర్ణయించినప్పటికీ చాలా రాష్ట్రాలు నిర్వహించడం లేదు.  దీనిపై ఉపాధ్యాయ సంఘాలు సైతం మండిపడుతున్నాయి.  20 సంవత్సరాలపైన సీనియారిటీ ఉన్న ఉపాధ్యాయుల ప్రమోషన్‌‌కు టెట్ మినహాయించాలని డిమాండ్ చేస్తున్నారు.  ఇప్పుడు  ప్రైవేటు స్కూళ్ల టీచర్లకు కూడా టెట్ అర్హత తప్పనిసరి.  కావున ప్రతి ఏటా రెండుసార్లు టెట్ నిర్వహిస్తే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయులకు మేలు జరుగుతుంది. 

- కె. వేణుగోపాల్, 
విద్యారంగ విశ్లేషకుడు