MLC 2025: సూపర్ కింగ్స్ తడాఖా: చేసింది 153 పరుగులే.. 90 పరుగులతో విజయం

MLC 2025: సూపర్ కింగ్స్ తడాఖా: చేసింది 153 పరుగులే.. 90 పరుగులతో విజయం

మేజర్ లీగ్ క్రికెట్ 2025లో టెక్సాస్ సూపర్ కింగ్స్ జోరు కొనసాగుతుంది. వరుస విజయాలతో టోర్నీలో ఓటమి లేని జట్టుగా దూసుకెళ్తుంది. ఈ టోర్నమెంట్ తొలి రెండు మ్యాచ్ ల్లో బ్యాటింగ్ లో అదరగొట్టిన సూపర్ కింగ్స్.. మంగళవారం  సియాటిల్ ఓర్కాస్ పై (జూన్ 17) బౌలింగ్ లో దుమ్మురేపింది. మొదట బ్యాటింగ్ చేసి 153 పరుగులే చేసినప్పటికీ ప్రత్యర్థి జట్టును కేవలం 60 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో ఏకంగా 93 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ టోర్నీలో సూపర్ కింగ్స్ జట్టుకు ఇది వరుసగా మూడో విజయం కాగా.. మరోవైపు  సియాటిల్ ఓర్కాస్ కు వరుసగా రెండో ఓటమి. 

మ్యాచ్ పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మొదట బ్యాటింగ్ చేసిన టెక్సాస్ సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగుల స్కోర్ మాత్రమే చేయగలిగింది.  ఓర్కాస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సూపర్ కింగ్స్ పరుగుల కోసం తీవ్రంగా ఇబ్బంది పడింది. సాయితేజ ముక్కమల్ల 30 పరుగులు చేసి టాప్ స్కోరర గా నిలిచాడు. డారిల్ మిచెల్ 25 పరుగులతో రాణించగా.. చివర్లో మార్కస్ స్టోయినిస్ కేవలం 12 బంతుల్లోనే నాలుగు సిక్సర్లతో 28 పరుగులతో జట్టు స్కోర్ ను 150 పరుగులకు చేర్చాడు. 

►ALSO READ | Sophie Devine: రెండు దశాబ్దాల ప్రయాణం: వన్డేలకు న్యూజిలాండ్ మహిళా దిగ్గజ ఆల్ రౌండర్ రిటైర్మెంట్

ఒక మాదిరి లక్ష్య ఛేదనలో సియాటిల్ ఓర్కాస్ కేవలం 60 పరుగులకే కుప్పకూలింది. సూపర్ కింగ్స్ బౌలర్లు బర్గర్, జియా-ఉల్-హక్, నూర్ అహ్మద్ విజృంభించడంతో ఏ దశలోనూ ఓర్కాస్ ఇన్నింగ్స్ గెలుపు దిశగా సాగలేదు. ఒక దశలో ఓర్కాస్ 27 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో టోర్నీ చరిత్రలో అత్యల్ప స్కోర్ నమోదు చేస్తుందనే అనుమానాలు కలిగాయి. అయితే చివరి ఆరోన్ జోన్స్ (17), జస్పిత్ సింగ్ (12) రెండంకెల స్కోర్ చేసి జట్టును చెత్త రికార్డ్ నుంచి కాపాడారు. జియా-ఉల్-హక్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.