- 93.38 శాతం మంది విద్యార్థులు హాజరు
హైదరాబాద్, వెలుగు: టీజీ ఎప్‌సెట్ అగ్రికల్చర్, ఫార్మసీ స్ర్టీమ్ విద్యార్థులకు నిర్వహించిన ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ మంగళవారంతో ప్రశాంతంగా ముగిశాయి. రెండ్రోజుల పాటు జరిగిన ఈ పరీక్షలకు 93.38శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 90,977 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 84,954 మంది పరీక్ష రాసినట్టు ఎప్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కె. విజయకుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
పరీక్షల్లో భాగంగా చివరి రోజైన మంగళవారం 30,391 మందికిగాను 28,667 మంది (94.33%) పరీక్ష రాశారు. 1,724 మంది గైర్హాజరయ్యారు. ఈ ఎగ్జామ్స్‌ను జేఎన్‌టీయూ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి, జేఎన్‌టీయూ వీసీ కిషన్ కుమార్ రెడ్డి, ఎప్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయకుమార్ రెడ్డి తదితరులు పర్యవేక్షించారు. అయితే, ఈ నెల 9 నుంచి11 వరకూ ఇంజినీరింగ్ స్ర్టీమ్‌కు పరీక్షలు జరగనున్నాయి.
