హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర విభజన జరిగి ఏండ్లు గడుస్తున్నా.. ఇంకా కొలిక్కిరాని పంపకాల పంచాయితీపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి దృష్టి సారించింది. విద్యాశాఖ పరిధిలోని షెడ్యూల్ 9, 10 సంస్థల ఆస్తులు, నిధుల పంపకాలపై తేల్చేందుకు సిద్ధమైంది.
హైదరాబాద్ నగరంలో ఏపీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, విద్యా సంస్థల వివరాల లెక్కలను ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ఈ క్రమంలో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 అమలులో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై డిసెంబర్ రెండో వారంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలతో హైలెవల్ రివ్యూ మీటింగ్ నిర్వహించే అవకాశాలున్నాయి.
తాజాగా జీఏడీ నుంచి వచ్చిన ఆదేశాలతో ఉన్నత విద్యాశాఖ అలర్ట్ అయింది. తక్షణమే తమ పరిధిలోని పెండింగ్ సమస్యలు, ఆస్తుల వివరాలతో నివేదిక ఇవ్వాలంటూ విద్యాశాఖ అధికారులు, అన్ని వర్సిటీలకు ఆ శాఖ సెక్రటరీ తాజాగా ఆదేశాలిచ్చారు. ఈ నెల11లోగా పూర్తి స్థాయి నివేదికను సాఫ్ట్, హార్డ్ కాపీల్లో సమర్పించాలని పేర్కొన్నారు.
కాలేజెట్, టెక్నికల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, స్టేట్ ఆర్కైవ్స్, తెలుగు అకాడమీ, ఓయూ, కాకతీయ, పాలమూరు సహా అన్ని యూనివర్సిటీల రిజిస్ట్రార్లకు ఈ మెమోలు పంపించారు. వచ్చే వారం జరిగే సమావేశంలో ప్రధానంగా 9 అంశాలపై చర్చించనున్నారు. ఇందులో విద్యాశాఖకు సంబంధించి కీలకమైనవి ఉన్నాయి. షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యాసంస్థల విభజన, ఆస్తుల పంపకాలపై చర్చించనున్నారు.
