
- సమూల మార్పులు తీసుకువచ్చేందుకు సర్కారు యోచన
- అధ్యయనం కోసం నిపుణుల కమిటీ నియామకం
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ దవాఖాన్లలో సానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త వ్యవస్థ ఎలా ఉండాలో అధ్యయనం చేయడానికి నిపుణుల కమిటీని ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే ఈ కమిటీ సభ్యులు హైదరాబాద్‌లోని పలు కార్పొరేట్ హాస్పిటల్స్‌లో పర్యటించి అక్కడ అనుసరిస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ వ్యవస్థను పరిశీలించారు. అలాగే, ఎయిమ్స్ వంటి ఆలిండియా ఇన్ స్టిట్యూట్లలో అవలంబిస్తున్న పద్ధతులపైనా ఆరా తీస్తున్నారు.
ఎలుకల్ని పట్టాల్నా, ట్రీట్‌మెంట్ చేయాల్నా?
ప్రస్తుతం హాస్పిటల్‌లో కరెంటు పోయినా, పేషెంట్లను ఎలుకలు కొరికినా, బాత్రూంలు కంపు కొట్టినా డ్యూటీ డాక్టర్లను బాధ్యులుగా చూపిస్తూ వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి వాటికి తాము ఏం చేయగలం అని డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రీట్‌మెంట్ చేయాల్నా, లేక ఎలుకల్ని పట్టాల్నా అని పలుమార్లు ప్రభుత్వాలకు నిరసన కూడా తెలిపారు. పేషెంట్‌కు ట్రీట్‌మెంట్ ఇచ్చే విషయంలో పొరపాటు జరిగితే తాము బాధ్యత వహిస్తామని.. కానీ, సెక్యూరిటీ, సానిటేషన్ వాళ్లు తప్పు చేస్తే తమకు సంబంధం లేదని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్లపై పారిశుధ్యం, భద్రతల పర్యవేక్షణ భారాన్ని తొలగించేలా కొత్త విధానానికి రూపకల్పన చేస్తున్నామని కమిటీ సభ్యులు చెబుతున్నారు.
డాక్టర్లను బెదిరిస్తున్న కాంట్రాక్టర్లు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సానిటేషన్, సెక్యూరిటీ, డైట్ వంటి నాన్ మెడికల్ డిపార్ట్‌మెంట్లు సూపరింటెండెంట్ల ఆధ్వర్యంలోనే ఉంటాయి. క్షేత్రస్థాయిలో ఈ పనుల పర్యవేక్షణను డాక్టర్లకు అప్పగిస్తున్నారు. రాజకీయ నాయకుల అండతో సానిటేషన్, సెక్యూరిటీ కాంట్రాక్టులు దక్కించుకుంటున్న బడాబాబులు.. డాక్టర్ల మాటను అసలు లెక్కచేయడం లేదు. వారికి నచ్చినట్టు వ్యవహారం నడిపిస్తున్నారు. వార్డులు ఎందుకు క్లీన్‌గా ఉండడం లేదని ఎవరైనా డాక్టర్లు గట్టిగా నిలదీస్తే, రివర్స్‌లో అటువంటి డాక్టర్లపై బెదిరింపులకు దిగుతున్నారు. వేధింపులకు గురిచేస్తున్నారు.
పవర్‌ఫుల్‌గా సూపరింటెండెంట్
కార్పొరేట్, ప్రైవేటు హాస్పిటల్స్ సానిటేషన్, సెక్యూరిటీ వ్యవస్థకు డాక్టర్లకు అసలు సంబంధం ఉండదు. ఈ రెండు వ్యవస్థలను పర్యవేక్షించడానికి సానిటేషన్, సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్లు ఉంటాయి. ఈ డిపార్ట్‌మెంట్లలో పనిచేసే సిబ్బందే క్షేత్రస్థాయిలో పారిశుధ్యం, భద్రతా వ్యవస్థను పర్యవేక్షిస్తారు. ఈ రెండు డిపార్ట్‌మెంట్లకు వేర్వేరుగా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లు (ఏఓ) ఉంటారు. వీరు హాస్పిటల్ సూపరింటెండెంట్‌కు రిపోర్ట్ చేస్తారు. సర్కార్ దవాఖాన్లలోనూ ఇదే తరహా సిస్టమ్‌ను అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ వ్యవస్థ అమల్లోకి వస్తే పేషెంట్‌ను ఎలుకలు కరిచినా, హాస్పిటల్‌లోకి పందులు, కుక్కలు వచ్చినా, బాత్రూంలు కంపు కొట్టినా పూర్తి బాధ్యత ఆయా డిపార్ట్‌మెంట్ల ఏఓలపైనే ఉంటుంది. వీటిపై చర్యలు తీసుకునే పూర్తి అధికారం హాస్పిటల్ సూపరింటెండెంట్‌కు ఉంటుంది.