ఆర్టీసీ కార్గోపై సర్కారు ఫోకస్

ఆర్టీసీ కార్గోపై సర్కారు ఫోకస్
  • రెవెన్యూ కోసం వెహికల్స్ పెంచాలని ఆధికారులకు ఆదేశం
  •  ప్రత్యామ్నాయ ఆదాయానికి ప్లాన్స్ రెడీ చేయాలని సూచన
  •  జాగాల లీజుకు టెండర్లు ఆహ్వానం 

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్గోను మరితం బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మరిన్ని వెహికల్స్, పార్సిళ్ల సంఖ్యను పెంచాలని ఆర్టీసీ ఆఫీసర్లను ఆదేశించింది. కార్గో విస్తరణకు ప్లాన్స్ రెడీ చేసి అందజేయాలని స్పష్టం చేసింది. ఆర్టీసీ కార్గో ద్వారా రోజుకు 14 వేల పార్సిళ్లు రాష్ర్ట వ్యాప్తంగా వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ర్టాలకు వెళుతున్నాయి. మార్కెట్లో ఉన్న ప్రైవేట్ కొరియర్ కంపెనీల చార్జీలతో పోలిస్తే ఆర్టీసీ కార్గో రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. వెయిట్ ప్రకారం ధర, సర్కారు సంస్థ, ట్రాకింగ్, భద్రత వంటి అంశాల నేపథ్యంలో ఆర్టీసీ కార్గోపై పబ్లిక్ ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.  ప్రస్తుతం 390 సెంటర్లలో పార్సిళ్లు స్వీకరించి.. 190 వెహికల్స్ ద్వారా  గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. దీనిద్వారా ప్రతి నెలా రూ.10 కోట్ల రెవెన్యూ వస్తున్నది.   

ప్రత్యామ్నాయ రెవెన్యూ కోసం..

మేడారం జాతరకు వెళ్లలేని భక్తులకు సమ్మక్క సారాలమ్మ ప్రసాదాన్ని వారి ఇంటికి ఆర్టీసీ కార్గో చేరవేస్తున్నది . ఈ నెల 14 నుంచి 25వ తేదీ వరకు ప్రసాదాన్ని బుకింగ్‌‌ చేసుకునే సదుపాయం కల్పించింది. భక్తులు సమీపంలోని టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్(కార్గో) కౌంటర్లలో, పీసీసీ ఏజెంట్లు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ల వద్ద రూ.299 చెల్లించి మేడారం ప్రసాదాన్ని బుకింగ్ చేసుకోవచ్చని,  https://rb.gy/q5rj68 లింక్‌‌ పై క్లిక్‌‌ చేసిగానీ లేదా పేటీఎం ఇన్‌‌ సైడర్‌‌ యాప్‌‌ లోనూ ప్రసాదాన్ని ఆర్డర్ ఇవ్వొచ్చని సూచించింది. కార్గో ద్వారా ప్రసాదం పంపిణీ చేస్తే అదనపు రెవెన్యూ రానుందని అధికారులు చెబుతున్నారు. ఇక 32వేల అంగన్వాడీ కేంద్రాలకు ఆర్టీసీ కార్గో ద్వారా బాలా మృతంతో పాటు చిన్న పిల్లలకు, గర్బిణీ స్ర్తీలకు ఇచ్చే సరుకులను ఆర్టీసీ సరఫరా చేస్తున్నది. ఆర్టీసీ కార్గో ద్వారా పంపించే వస్తువులను ప్యాక్ చేసే పనిని పార్సిల్ కౌంటర్ సిబ్బందికే ఇవ్వాలని యోచిస్తున్నది. ఇతర డిపార్ట్ మెంట్లలో కూడా ట్రాన్స్ పోర్ట్ ఉంటే కార్గోకు ఇవ్వాలని ప్రభుత్వానికి ఆర్టీసీ లేఖలు రాయనున్నట్లు సమాచారం. 

జాగాల లీజుతో లోటు భర్తీ

ఆర్టీసీకి గతంలో డైలీ రూ. 15 కోట్ల రెవెన్యూ వచ్చేది. మహాలక్ష్మీ స్కీమ్ తరువాత ఈ రెవెన్యూ రూ.9 కోట్లకు తగ్గింది. వీటితో పాటు గర్ల్స్ స్టూడెంట్స్ బస్ పాస్ లు బంద్ అయ్యాయి.  ప్రతి నెల సబ్సిడీ అమౌంట్ సుమారు  రూ.350కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం విడుదల చేస్తున్నది. ఆ లోటును భర్తీ చేసే ప్రయత్నాలను అధికారులు మొదలుపెట్టారు. అందులో భాగంగా కార్గో బలోపేతంతో పాటు ఆర్టీసీకి చెందిన విలువైన జాగాలను లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. గతంలో ఉన్న టెండర్ల గైడ్ లైన్స్ ను మార్చేసి ఇటీవల 38.59 ఎకరాలను లీజుకు ఇచ్చింది. గత ప్రభుత్వంలోని లీజు బకాయిలను రాబట్టేందుకు చర్యలు చేపట్టింది. 

ఆర్టీసీ కార్గోను బలోపేతం చేస్తం

ఆర్టీసీని మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నం. మహాలక్ష్మీ స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు సుమారు 18 కోట్ల మంది జర్నీ చేశారు. సబ్సిడీ నిధులను కూడా వెంటనే విడుదల చేస్తున్నం.  ఆర్టీసీ కార్గోకు ఎక్కువ పార్సిళ్లు బుక్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నం. బుకింగ్ సెంటర్లు పెంచుతం. దీనికి సంబంధించిన ప్లాన్ రెడీ చేయాలని అధికారులను ఆదేశించాం. వాళ్లు ప్రతిపాదనలు ఇచ్చాక సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటం. వచ్చే 5 ఏళ్లలో కార్గో ద్వారా రెవెన్యూ పెంచేలా చర్యలు తీసుకుంటం.    
~ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్