టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 1వ తేదీ వరకూ ఎడిట్ ఆప్షన్

టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 1వ తేదీ వరకూ ఎడిట్ ఆప్షన్

హైదరాబాద్: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ టెట్)కు అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్ అవకాశం కల్పించాలని విద్యా శాఖ నిర్ణయించింది. ఇవాల్టి (మంగళవారం) నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు ఎడిట్ ఆప్షన్ చేసుకునే అవకాశం ఇచ్చినట్లు విద్యా శాఖ పేర్కొంది. నవంబర్ 29న టెట్ దరఖాస్తు గడువు ముగియనుంది. దీంతో.. భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. అయితే, నచ్చిన చోట సెంటర్ కావాలంటే ముందే అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సిందేనని అధికారులు చెప్తున్నారు.

టీజీ టెట్ సెంటర్ల కేటాయింపులో విద్యా శాఖ ఈసారి కూడా ‘ఫస్ట్ కమ్- ఫస్ట్ సర్వ్’(ముందు వచ్చిన వారికి ముందు) నిబంధనను అమలు చేస్తోంది. పరీక్ష రాసేందుకు సొంత జిల్లా లేదా ఇంటికి దగ్గర్లో ఉన్న సెంటర్ కోరుకునే అభ్యర్థులు ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

2026 జనవరిలో జరిగే టెట్ కోసం 2025, నవంబర్ 15 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం సాయంత్రం వరకు 1,26,085 మంది అప్లై చేసుకున్నారు. దీంట్లో 46,954 మంది పేపర్ 1 కోసం, 79,191 మంది పేపర్ 2 కోసం దరఖాస్తు చేశారు. ఈ నెల 29 వరకు దరఖాస్తులకు అవకాశం ఉంది. ఈ నెల 25 నుంచి డిసెంబర్ 1 వరకు దరఖాస్తుల్లో ఏమైనా తప్పులుంటే సవరణకు చాన్స్ ఇచ్చారు. అయితే, దరఖాస్తునకు మరో ఐదు రోజులే ఉండటంతో అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా త్వరగా అప్లై చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.