
- అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు టీజీసీఎస్‌బీ హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ప్రజలను రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) హెచ్చరించింది. ఇటీవల క్రెడిట్, డెబిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్ రీడీమ్ పేరుతో సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలిపింది. సైబర్ మోసగాళ్లు రివార్డ్ పాయింట్స్ పేరుతో ఫోన్లకు ఫేక్ ఎస్‌ఎమ్‌ఎస్‌లు, వాట్సాప్ మెసేజ్‌లు, లింకులు, ఏపీకే ఫైల్స్ పంపుతున్నారని వెల్లడించింది. యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా పేర్లతో నకిలీ వెబ్‌సైట్ లింకులు పంపి, క్లిక్ చేయగానే ఓటీపీ, పిన్‌లు సేకరించి బ్యాంక్ అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారని వివరించింది.
ఆ తర్వాత వేల రూపాయలు కొల్లగొడుతున్నారని చెప్పింది. ఇలాంటి ఫిర్యాదులు ఇటీవల ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అనుమానాస్పద కాల్స్ వచ్చిన వెంటనే సంబంధిత బ్యాంకులను నేరుగా సంప్రదించాలని టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయల్ సూచించారు. బాధితులు వెంటనే హెల్ప్‌లైన్ 1930, వాట్సాప్ నంబర్ 87126 72222, లేదా cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు. అనుమానాస్పద లింకులు క్లిక్ చేయవద్దని హెచ్చరించారు.