
- చాలా హాస్పిటల్స్‌లో క్వాలిఫైడ్డాక్టర్లు లేకుండానే దోపిడీ
- సంబంధం లేని ట్రీట్టెంట్చేస్తూ ప్రాణాలతో చెలగాటం
- ఆపరేషన్ థియేటర్లు అధ్వానం.. అసంపూర్తిగా కేస్ షీట్స్
- టీజీఎంసీకి పెరుగుతున్న ఫిర్యాదులు
మంచిర్యాల, వెలుగు: జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటల్స్‌పై తెలంగాణ మెడికల్ కౌన్సిల్(టీజీఎంసీ) ఫోకస్ పెట్టింది. చాలా హాస్పిటళ్లలో క్వాలిఫైడ్ డాక్టర్లు లేకున్నా సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ పేరుతో పేషెంట్లను దోచుకుంటున్నారని, కనీస ప్రమాణాలు పాటించకుండా వేలకు వేలు ఫీజులు గుంజుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లా లోని అన్ని హాస్పిటల్స్‌ను తనిఖీ చేయడంతో పాటు వాటిలో పనిచేస్తున్న డాక్టర్ల ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, సర్టిఫికెట్లను తనిఖీ చేయాలని నిర్ణయించింది.
ఇప్పటివరకు ఆర్ఎంపీ, పీఎంపీలపై ఫోకస్ పెట్టి రూల్స్‌కు విరుద్ధంగా తమ పరిధి దాటి పేషంట్లకు ట్రీట్మెంట్ చేస్తున్నట్టు గుర్తించింది. జిల్లావ్యాప్తంగా 50కి పైగా కేసులు నమోదు చేసింది. పలువురు ఆర్ఎంపీలపై పోలీసులకు ఫిర్యాదు చేసి క్రిమినల్ కేసులు బుక్ చేయించింది. దీంతో ఆర్ఎంపీల దందా కొంతవరకు కంట్రోల్ అయింది. ఇక ప్రైవేట్ హాస్పిటల్స్ తనిఖీలకు టీజీఎంసీ రెడీ కావడంతో కొందరు డాక్టర్లకు టెన్షన్ పట్టుకుంది.
చదువొకటి.. వైద్యం మరొకటి..
మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు బెల్లంపల్లి, చెన్నూర్, లక్సెట్టిపేట తదితర ప్రాంతాల్లో 280 ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. కొన్నింట్లో క్వాలిఫైడ్ డాక్టర్లు లేనప్పటికీ ఉన్నట్టు పబ్లిసిటీ చేసుకొని పేషెంట్లను మోసం చేస్తున్నారు. కొంతమంది డాక్టర్లు చదివిన డిగ్రీ ఒకటైతే దానికి సంబంధంలేని ట్రీట్మెంట్ అందిస్తూ పేషెంట్ల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు.
సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ పేరిట కొనసాగుతున్న పలు హాస్పిటల్స్‌లో ఎంబీబీఎస్, ఆయుర్వేద, హోమియో డాక్టర్లు స్పెషలిస్టులుగా చలామణి అవుతూ పేషెంట్లు ప్రాణాలతో చెలగాటమాడుతున్న విషయం టీజీఎంసీ దృష్టికి వచ్చినట్టు తెలిసింది. పేషెంట్లను మభ్యపెట్టి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈ క్రమంలో ఏదైనా సమస్య వస్తే బయట నుంచి స్పెషలిస్ట్ డాక్టర్లను పిలిచి వైద్యం అందిస్తున్నారు.
జనరల్ సర్జన్.. యూరాలజీ ట్రీట్మెంట్
జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా సమీపంలోని ఓ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎంబీబీఎస్, ఎంఎస్ క్వాలిఫికేషన్ కలిగిన ఒక డాక్టర్ తనకు సంబంధం లేని యూరాలజీ ట్రీట్మెంట్ అందిస్తున్నాడు. మూడు నెలల కిందట కిడ్నీ నొప్పితో బాధపడుతున్న ఓ పేషెంట్‌కు ట్రీట్మెంట్ చేయగా అది వికటించింది. దీంతో బాధితుడు యూరాలజిస్ట్‌ను సంప్రదించి మెరుగైన వైద్యం తీసుకున్నాడు. దీనిపై ఫిర్యాదు రావడంతో టీజీఎంసీ ప్రతినిధులు సదరు హాస్పిటల్లో తనిఖీ చేయగా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.
ఎంబీబీఎస్, ఎంఎస్ క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ టీజీఎంసీలో ఎంబీబీఎస్గానే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఎంఎస్ రిజిస్ట్రేషన్ లేకుండానే ప్రాక్టీస్ చేస్తున్నట్టు తేలింది. అంతేకాకుండా తనకు సంబంధం లేని గైనకాలజీ, రేడియాలజీ సేవలు సైతం అందిస్తున్నట్టు గుర్తించి అతనికి నోటీసులు జారీ చేశారు. హాస్పిటల్, ఆపరేషన్ థియేటర్ నిర్వహణ అధ్వానంగా ఉండడంతో పేషెంట్లకు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉన్నట్టు గుర్తించారు. నిత్యం 20 నుంచి 30 మంది ఇన్ పేషెంట్లు ఉండే ఈ హాస్పిటల్ నిర్వహణను గాలికి వదిలేయడంపై టీజీఎంసీ మెంబర్లు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
ఆ డాక్టర్ కేస్ షీట్లను సైతం సరిగా మెయింటెన్ చేయకపోవడంతో తదుపరి విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు.బెల్లంపల్లి చౌరస్తా సమీపంలో ఉన్న మరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో క్వాలిఫైడ్ డాక్టర్లు లేరు. ఎంబీబీఎస్ డాక్టరే అన్ని రోగాలకు ట్రీట్మెంట్ చేస్తున్నాడు. ఈ విషయంపై ఫిర్యాదులు రావడంతో టీజీఎంసీ ప్రతినిధులు తనిఖీ చేసి సదరు డాక్టర్లకు నోటీసులు జారీ చేశారు. అదే ఏరియాలో ఉన్న మరో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్లో సైతం ఇదే పరిస్థితి. అక్కడ కూడా క్వాలిఫై డాక్టర్లు లేకున్నా క్రిటికల్ కేర్ ట్రీట్మెంట్ అందిస్తామని పబ్లిసిటీ చేసుకుంటున్నారు.
ఫిర్యాదు చేస్తే డబ్బులతో సెటిల్మెంట్
డాక్టర్లు నిర్లక్ష్యంగా, తెలిసీ తెలియని ట్రీట్మెంట్ చేయడం, వైద్యం వికటించిన సందర్భాల్లో బాధితులు పోలీసులకు గానీ, టీజీఎంసీకి గానీ ఫిర్యాదు చేస్తే హాస్పిటల్ నిర్వాహకులు వారికి డబ్బులు ఇచ్చి కేసులు విత్ డ్రా చేయించుకుంటున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఐబీ చౌరస్తా సమీపంలో ఇటీవల భారీ హంగులతో వెలసిన ఓ హాస్పిటల్లో తాజాగా ఇదే జరిగింది. హాస్పిటల్ నిర్వహిస్తున్న సీనియర్ డాక్టర్ తన కింద పనిచేసే జూనియర్ డాక్టర్లకు కేసులను అప్పగిస్తున్నారు. ఈ క్రమంలో డెలివరీ కోసం వచ్చిన ఓ మహిళ కడుపులోనే శిశువు చనిపోయింది. బాధితులు టీజీఎంసీకి ఫిర్యాదు చేయగా.. వారికి డబ్బులు ఇచ్చి కేసు విత్ డ్రా చేయించారు. విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తూ కోట్లలో డబ్బులు సంపాదిస్తున్న కొంతమంది డాక్టర్లు ఇలాంటి సందర్భాల్లో పేషంట్లను పైసలతో ప్రలోభపెట్టి కేసుల నుంచి ఎస్కేప్ అవుతున్నారు.