మేడారంలో నిర్విరామ విద్యుత్ సరఫరా

మేడారంలో నిర్విరామ విద్యుత్ సరఫరా

ములుగు/ తాడ్వాయి, వెలుగు: మేడారంలో నిర్విరామ విద్యుత్​ సరఫరాకు చర్యలు తీసుకున్నామని, రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీతో 106 ట్రాన్స్​ఫార్మర్ల ను నిత్యం పర్యవేక్షించనున్నామని టీజీఎన్​పీడీసీఎల్​ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. మంగళవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని విద్యుత్​ సబ్ స్టేషన్లు, పలు ట్రాన్స్​ఫార్మర్లను అధికారులు, సిబ్బందితో కలిసి పర్యవేక్షించిన ఆయన సిబ్బందికి టీషర్ట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ కమలాపూర్, పస్రా, ములుగు తదితర నాలుగు వేర్వేరు మార్గాల నుంచి వచ్చే విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా నిత్యం పర్యవేక్షిస్తామన్నారు.

జాతర విధుల్లో ఉండే సిబ్బందితో 55 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఎప్పటికప్పుడు సరఫరాను మానిటర్​ చేసేందుకు 600ల మంది సిబ్బంది పనిచేస్తున్నారన్నారు. అధికారులు, సిబ్బంది అంకిత భావంతో పనిచేసి జాతరలో విద్యుత్ సేవలను సక్సెస్​ చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డైరెక్టర్లు మోహన్ రావు, మధుసూదన్, సీఈ ఐటీ శ్రవన్ కుమార్, జీఎం శ్రీనివాస్, ములుగు ఎస్ఈ ఆనందం, భూపాలపల్లి ఎస్ఈ మల్చూర్, డీఈ నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.