ఎన్నికలు జరపాల్సిందే!... గరంగరంగా టీజీవో ఈసీ మీటింగ్

ఎన్నికలు జరపాల్సిందే!... గరంగరంగా టీజీవో ఈసీ మీటింగ్
  •     ఎన్నికలు జరపాల్సిందే!
  •     గరంగరంగా టీజీవో ఈసీ మీటింగ్
  •     ఎలక్షన్లు పెట్టాల్సిందేనని మెజార్టీ సభ్యుల పట్టు
  •     తొలుత దాటవేసేందుకు నేతల యత్నం, ఆపై నిర్వహణకు ఓకే 
  •     11 ఏండ్ల తర్వాత  టీజీవోలో జరగనున్న ఎలక్షన్స్​!

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీజీవో)లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని మెజార్టీ సభ్యులు పట్టుబట్టారు. రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షుల నియామకం నామినేటెడ్ పద్ధతిలో చేపట్టవద్దని తేల్చి చెప్పారు. ఆదివారం నాంపల్లి టీజీవో ఆఫీస్ లో 4 గంటల పాటు గరం గరంగా మీటింగ్ సాగింది. కేంద్ర సంఘంతో పాటు 33 జిల్లాల అధ్యక్ష,  కార్యదర్శులు మొత్తం 50 మందికి పైగా అటెండ్ అయ్యారు. గత పదేండ్ల నుంచి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించకుండా వారికి నచ్చిన వ్యక్తులనే నామినేట్ పద్ధతిలో నియమించారని పలువురు సభ్యులు అభ్యంతరం తెలిపారు. దీంతో టీజీవో ప్రెసిడెంట్ మమత వారిని వారించే ప్రయత్నం చేసింది. 

ఇప్పటి వరకు ఎన్నికలు జరిగాయని, నామినేషన్లు రాకపోవటంతోనే ఏకగ్రీవం అయ్యాయని, ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని ఎలా అంటారని ఆమె ప్రశ్నించింది. వచ్చే మీటింగ్ లో ఎన్నికలపై నిర్ణయం తీసుకుందామని చెప్పే ప్రయత్నం చేయగా.. ఎవరూ ఒప్పుకోకపోవటంతో ఈ మీటింగ్ లోనే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఎన్నికల నిర్వహణకు ఇద్దరు రిటైర్డ్ అధికారులను నియమించారు. వారంలోగా ఓటర్ లిస్ట్ ఖరారు చేసి, వచ్చే నెలలో టీజీవో ఎన్నికలు నిర్వహించనున్నట్లు నేతలు చెబుతున్నారు.

ఫిబ్రవరిలో ఎన్నికలు

టీజీవోలో పదకొండేండ్ల తర్వాత ఎన్నికలు జరగబోతున్నాయి. చివరి సారిగా 2012లో ఎన్నికలు జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సుమారు 14,500 గెజిటెడ్ పోస్టులు ఉండగా.. ప్రస్తుతం 12 వేల మంది పనిచేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పనిచేస్తున్న గెజిటెడ్ ఉద్యోగుల మెంబర్ షిప్, ఓటర్ లిస్ట్, నామినేషన్లు, పోలింగ్ ఈ ప్రాసెస్ అంతా జరగనుంది. జనవరిలో ఈ ప్రాసెస్ పూర్తి చేసి, ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అన్న అంశంపై ప్రస్తుత ప్రెసిడెంట్ మమత  డైలామాలో ఉన్నట్లు తెలుస్తోంది. 

ప్రభుత్వానికి సహకరిస్తం: సెక్రటరీ సత్యనారాయణ

రాష్ట్ర కార్యవర్గంలో పలు తీర్మానాలు చేసినట్లు టీజీవో జనరల్ సెక్రటరీ సత్యనారాయణ వెల్లడించారు. కొత్త ప్రభుత్వానికి గెజిటెడ్ అధికారులం సహకరిస్తామని, ప్రభుత్వ స్కీమ్ లను ప్రజల్లోకి తీసుకెళతామన్నారు. ఇటీవల కొంత మంది.. టీజీవో పై, గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ పై చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, వీటిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.