
పాపన్నపేట, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగులకు 42 శాతం ఫిట్ మెంట్ తో పీఆర్సీని అమలు చేయాలని తెలంగాణ గెజిటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు డిమాండ్చేశారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘ కార్యవర్గ సమావేశం శుక్రవారం పాపన్నపేట మండల పరిధిలోని ఏడుపాయల లో జరిగింది. సమావేశంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘ కార్యవర్గం, తెలంగాణలోని 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, సచివాలయం, హైదరాబాద్ సిటీ అధ్యక్ష, కార్యదర్శులతో పాటు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం 106 ఫోరమ్స్ అధ్యక్ష, కార్యదర్శులు మహిళా విభాగం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ముఖ్యమైన విషయాలపై చర్చ అనంతరం పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. పే రివిజన్ కమిషన్ రిపోర్ట్ వెంటనే తెప్పించుకొని ఉద్యోగులకు 42 శాతం పిట్ మెంట్ ను ఇచ్చి తెలంగాణ రెండో పీఆర్సీని అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయాలని, ప్రభుత్వం ప్రకటించిన మేరకు ప్రభుత్వ ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ సమాన నిష్పత్తిలో చేసి ఉద్యోగుల ఆరోగ్య పథకం విధి విధానాలను అమలు చేయాలని, రాష్ట్రంలో కాంట్రిబ్యూషన్ పెన్షన్ ను రద్దుచేసి పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించాలని తీర్మానించారు.
సమావేశంలో అసోసియేట్ అధ్యక్షుడు శ్యామ్, కోశాధికారి ఉపేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు జగన్మోహన్ రావు, సహదేవ్, రామకృష్ణ గౌడ్, నరహరి రావు, మల్లేశం, సెక్రటరీలు పరమేశ్వర్ రెడ్డి, శిరీష, శ్రీనివాస్ రెడ్డి, హరికృష్ణ, శ్రీధర్ పాల్గొన్నారు.