
హైదరాబాద్, వెలుగు: గ్రూప్–1 మెయిన్స్‌లో అభ్యర్థులకు న్యాయం చేయాలన్న లక్ష్యంతో పద్ధతి ప్రకారం వాల్యుయేషన్ నిర్వహించినట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) బుధవారం హైకోర్టుకు తెలిపింది. మూల్యాంకన ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేవని తేల్చి చెప్పింది. మూడు దశల్లో ఎక్కడా వివక్షకు అవకాశం లేకుండా వాల్యుయేషన్ జరిగిందని వివరించింది. గ్రూప్–1 పరీక్షల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని, పరీక్షను రద్దు చేయాలంటూ దాఖలైన పలు పిటిషన్‌లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు మూడోరోజు బుధవారం విచారించారు. టీజీపీస్సీ తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు.
మూడు దశల్లో మూల్యాంకనం..
మూల్యాంకనం 3 దశల్లో జరిగిందేగానీ, పునర్ మూల్యాంకనం జరగలేదని నిరంజన్ రెడ్డి కోర్టుకు చెప్పారు. మొదట ప్రొఫెసర్ మూల్యాంకం చేశారని, రెండోసారి మరో ప్రొఫెసర్ చేయగా.. ఈ రెండింటికి వ్యత్యాసం 15 శాతానికి మించితే మూడో వ్యక్తి మూల్యాంకనం చేశారని తెలిపారు. ఇందులో దగ్గరగా ఉన్న రెండు మూల్యాంకనాలను తీసుకుని వాటి సగటును మార్కులుగా కేటాయిస్తారని వివరించారు.
ఎవరికివారు కొత్తగా మూల్యాంకనం చేస్తారని తెలిపారు. ఒకరు ఎన్నెన్ని మార్కులు కేటాయించారన్నది మరొకరికి తెలియదన్నారు. మూల్యాంకనం సమయంలో జవాబు పత్రాలకు అనుసంధానంగా ఉన్న అభ్యర్థి పేరు, హాల్‌టికెట్ నంబర్, ఇతర వివరాలను తొలగించి బండిళ్లను మూల్యాంకన కేంద్రాలకు పంపుతామన్నారు.
ఇందులో ఎవరు.. ఎవరి జవాబు పత్రాలను దిద్దుతున్నారనేది ప్రొఫెసర్లకు తెలియదన్నారు. మూల్యాంకనం జరిగిన తరువాత బార్ కోడ్ ద్వారా కంప్యూటర్‌లో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయన్నది తెలుస్తుందన్నారు. మూల్యాంకనం చేసేవారిలో కొందరు కఠినంగా వ్యవహరించవచ్చని, మరికొందరు ఉదాసీనంగా ఉండొచ్చని, ఇలాంటి కారణాలతో అభ్యర్థులు నష్టపోకూడదనే మూడు దశల్లో మూల్యాంకనం జరుగుతుందని కోర్టుకు వివరించారు. మూల్యాంకనం చేసేవారి వద్ద ఒక పర్యవేక్షకుడు ఉంటారని, ఏదైనా అనుమానం ఉన్నట్లయితే పరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకుంటూ ఉంటారన్నారు.
సౌలభ్యం కోసమే రెండో హాల్‌టికెట్
రెండు హాల్‌టికెట్‌లను కేటాయించడంతో జరిగిన నష్టమేంటో ఎవరూ చెప్పలేదని నిరంజన్ రెడ్డి కోర్టుకు వివరించారు. ప్రిలిమ్స్‌కు 1.20 లక్షల మందికిపైగా హాజరయ్యారని, ఇందులో 1:50 శాతంతో మెయిన్స్‌కు సుమారు 30 వేల మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. నంబర్ల కేటాయింపులో సౌలభ్యం కోసం ఇలా రెండో హాల్‌టికెట్ జారీ చేశామన్నారు.
జవాబు పత్రాల్లో మొదటి హాల్‌టికెట్ నంబర్ కూడా ఉంటుందని, అందువల్ల ఇందులో సందేహాలకు అవకాశం లేదని అన్నారు. పరీక్షా కేంద్రాల్లో ఇంటర్నెట్ సౌకర్యం ఉంటే అవకతవకలకు అవకాశం ఉంటుందని, అందుకే నిలిపివేసినట్లు తెలిపారు. అయితే ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయకుండా తీసుకున్న చర్యల్లో భాగంగా బయోమెట్రిక్‌ను నమోదు చేసినట్లు తెలిపారు.
తెలుగువాళ్లకు అన్యాయం: పిటిషనర్ల తరఫు లాయర్లు
పిటిషనర్ల తరఫున న్యాయవాదులు కె.శ్రీనివాసమూర్తి, రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ తెలంగాణ భవిష్యత్తుకు ఈ పరీక్షలు కీలకమన్నారు. తప్పుల తడకగా నిర్వహించిన పరీక్షల వల్ల జరిగే ఎంపిక రాబోయే రెండుమూడు తరాలపై ప్రభావం చూపుతుందన్నారు. తెలుగులో 8 వేల మంది పరీక్ష రాస్తే కేవలం 60 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారన్నారు.
మూల్యాంకనం చేసినవారికి తెలుగు తెలియకపోవడంతో అన్యాయం జరిగిందనగా న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఏయే భాషలో ఎంత మంది పరీక్షలు రాశారు.. ఎంతమంది ఉత్తీర్ణులయ్యారని కమిషన్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. ఈ అంశం పిటిషన్‌లలో లేదని న్యాయవాది సమాధానం ఇవ్వడంతో కోర్టు అడిగినపుడు ఇవ్వాల్సిందేనని వ్యాఖ్యానించారు. వాదనలు గురువారం కూడా కొనసాగనున్నాయి.