గ్రూప్-1పై డివిజన్ బెంచ్‌‌కు.. టీజీపీఎస్సీ సమాలోచనలు

గ్రూప్-1పై డివిజన్ బెంచ్‌‌కు.. టీజీపీఎస్సీ సమాలోచనలు

హైదరాబాద్, వెలుగు: గ్రూప్-1 రిక్రూట్మెంట్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) సమాలోచనలు జరుపుతోంది. 222 పేజీల తీర్పు కాపీని క్షుణ్ణంగా పరిశీలించి, తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోవాలని కమిషన్ నిర్ణయించింది. 

గ్రూప్-1 మెయిన్స్ ఆన్సర్ షీట్లను మాన్యువల్‌‌‌‌‌‌‌‌గా రీవాల్యుయేట్ చేయాలని మంగళవారం (సెప్టెంబర్ 09) హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశించింది. దాంతో అదే రోజు టీజీపీఎస్సీ కమిటీ సమావేశమై చర్చించింది.సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. డివిజన్ బెంచ్ కు వెళ్లాలని ప్రాథమికంగా డిసైడ్ అయింది. 

బుధవారం మరోసారి భేటీ కావాలని భావించారు. అయితే, టీజీపీఎస్సీ చైర్మన్​ వ్యక్తిగత పనులతో ఆఫీసుకు రాకపోవడంతో మీటింగ్ వాయిదా పడినట్టు తెలిసింది. ఈ క్రమంలో గురువారం సమావేశం అయ్యే అవకాశం ఉంది.  తీర్పుపై హైకోర్టు అడ్వకేట్ జనరల్​తో పాటు లీగల్ టీములతోనూ చర్చించాలని నిర్ణయించారు. ఆ తర్వాతే అధికారికంగా ప్రకటన చేయాలని కమిషన్ అధికారులు భావిస్తున్నారు. గ్రూప్ 1 నిర్వహణలో కమిషన్ చేసిన​అనేక లోపాలను కోర్టు ఎత్తిచూపింది. వీటన్నింటికీ కమిషన్ ఎలాంటి కౌంటర్  రెడీ చేస్తోందనే దానిపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొన్నది.