టీజీపీఎస్సీ ఓటీఆర్‌‌‌‌లో సర్టిఫికెట్ల అప్‌‌‌‌లోడ్ తప్పనిసరి : టీజీపీఎస్సీ

టీజీపీఎస్సీ ఓటీఆర్‌‌‌‌లో సర్టిఫికెట్ల అప్‌‌‌‌లోడ్ తప్పనిసరి : టీజీపీఎస్సీ
  • 19 నుంచి ఎడిట్ ఆప్షన్.. ఫిబ్రవరి 9 వరకు గడువు: టీజీపీఎస్సీ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ, రాబోయే వరుస ఉద్యోగ నోటిఫికేషన్ల నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కమిషన్ పరిధిలో ‘వన్ టైమ్ రిజిస్ట్రేషన్’ (ఓటీఆర్) చేసుకున్న అభ్యర్థులు తమ వివరాలను సరిచూసుకునేందుకు, అవసరమైతే సర్టిఫికేట్లు అప్‌‌‌‌డేట్ చేసుకునేందుకు మరో అవకాశం కల్పించింది. సోమవారం నుంచి ఫిబ్రవరి 9వ తేదీదాకా టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని కమిషన్ సెక్రటరీ ఎం.హరిత వెల్లడించారు. . ఓటీఆర్ లోని వివరాలే భవిష్యత్ నోటిఫికేషన్లకు ప్రామాణికమని, అందుకే అభ్యర్థులు జాగ్రత్తగా సరిచూసుకుని నింపాలని సూచించారు.

ఈసారి ఓటీఆర్ అప్‌‌‌‌డేట్‌‌‌‌లో కేవలం వివరాల మార్పు మాత్రమే కాకుండా సర్టిఫికెట్ల అప్‌‌‌‌లోడ్ కూడా టీజీపీఎస్సీ తప్పనిసరి చేసింది. అభ్యర్థులు తమ లేటెస్ట్ కలర్ పాస్‌‌‌‌పోర్ట్ సైజ్ ఫొటోతో పాటు విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో అప్‌‌‌‌లోడ్ చేయాలి. అదనపు డిగ్రీలు, పీజీలు చేసి ఉంటే ఆ వివరాలను కూడా యాడ్ చేసుకోవచ్చు.అదనపు అర్హతలు, అడ్రస్, ఈడబ్ల్యూఎస్, నాన్-క్రీమీలేయర్, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ మినహా మిగతా పర్సనల్ డేటా (పేరు, తేదీ ఆఫ్ బర్త్ మొదలైనవి) మార్చడానికి వీలుండదని కమిషన్ స్పష్టం చేసింది. ఒక్కసారి సేవ్ చేసిన వివరాలే ఫైనల్ అని, ఒకే అభ్యర్థికి ఒకే ఓటీఆర్ ఉండాలని అధికారులు హెచ్చరించారు.  అభ్యర్థులు https://www.tgpsc.gov.in వెబ్‌‌‌‌సైట్ ద్వారా గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు.