
- ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా మరో అప్పీల్ వేసే చాన్స్!
హైదరాబాద్, వెలుగు:
గ్రూప్- 1 పరీక్షలపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ అప్పీల్‌కు వెళ్లాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్ణయించింది. అవసరమైన ఆధారాలను సేకరించి, వారం రోజుల్లోగా డివిజన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేయాలని డిసైడ్ అయింది. మరోవైపు ప్రభుత్వం కూడా అప్పీల్ కు పోవాలని భావిస్తున్నది.
శుక్రవారం టీజీపీఎస్సీ ఆఫీసులో కమిషన్ చైర్మన్ బుర్ర వెంకటేశం అధ్యక్షతన కమిటీ సమావేశమైంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై సమీక్షించారు. కోర్టు తీర్పును సమీక్షించిన తర్వాత, రివ్యూ పిటిషన్ దాఖలు చేయడానికి తమకు బలమైన కారణాలు ఉన్నాయని కమిషన్ అభిప్రాయపడినట్టు తెలిసింది.
హైకోర్టు తీర్పు ప్రకారం రీవాల్యూయేషన్ చేస్తే అనేక సాంకేతిక సమస్యలు తలెత్తుతాయని టీజీపీఎస్సీ భావిస్తున్నది. గ్రూప్-1 నియామక ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేవని, తమ వాదనను బలంగా వినిపించాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం తీర్పు కాపీపై న్యాయపరమైన అంశాలను టీజీపీఎస్సీ లీగల్ సెల్ క్షుణ్ణంగా సమీక్షిస్తున్నది. ఇప్పటికే ప్రభుత్వ లీగల్ టీమ్‌ల అభిప్రాయాలను తీసుకున్నారు.