
శ్రీశైలం మల్లికార్జున స్వామి టెంపుల్ కు తెలంగాణలోని జిల్లాలతో పాటు ,హైదరాబాద్ నుంచి భక్తుల తాకిడి నిత్యం ఎక్కువవుతోంది. ఈ క్రమంలో భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసింది. భక్తుల సౌకర్యార్థం ఎయిర్ పోర్టు సమీపంలో ఉన్న RGIA క్రాస్ రోడ్స్ దగ్గర కొత్తగా బోర్డింగ్ పాయింట్ ని టీజీఎస్ఆర్టీసీ(TGSRTC )ఏర్పాటు చేసింది.
ఎయిర్ పోర్ట్ నుంచి పుష్పక్ బస్సుల్లో సమీపంలో ఉన్న RGIA బోర్డింగ్ పాయింట్ కి భక్తులు ప్రయాణించి.. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో శ్రీశైలానికి వెళ్లొచ్చు. ఈ బోర్డింగ్ పాయింట్ నుంచి ప్రతి 20 నిమిషాలకో బస్సు శ్రీశైలానికి అందుబాటులో ఉంటుంది. సూపర్ లగ్జరీ, రాజధాని ఏసీ బస్సులు ఉంటాయి. ఎయిర్ పోర్టు నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులు http://tgsrtcbus.in వెబ్ సైట్ లోనూ ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చు. రిజర్వేషన్ సమయంలో వారు RGIA క్రాస్ రోడ్ బోర్డింగ్ పాయింట్ ని ఎంచుకోవాలి. శ్రీశైలం వెళ్లే భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని టీజీఎస్ఆర్టీసీ (TGSRTC ) కోరుతోంది.
ఇప్పటికే తెలంగాణలోని పలు ఆలయాలకు టీజీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతోంది. టికెట్లపై పలు ఆఫర్లు కూడా ఇస్తోంది.