ఔటర్ లోపల మొత్తం ఎలక్ట్రిక్ బస్సులే : మంత్రి పొన్నం ప్రభాకర్

ఔటర్ లోపల మొత్తం ఎలక్ట్రిక్ బస్సులే : మంత్రి పొన్నం ప్రభాకర్
  • మంత్రి పొన్నం ప్రభాకర్
  • త్వరలోనే వాట్సాప్ టికెట్ బుకింగ్ సేవలు: సజ్జనార్

ముషీరాబాద్, వెలుగు: దేశంలో ఎక్కడా లేని విధంగా టీజీఎస్ఆర్టీసీలో ఆధునిక సంస్కరణలను ప్రవేశపెడుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సోమవారం ముషీరాబాద్ డిపోలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్​తో కలిసి డిజిటల్​పేమెంట్స్ అమలు తీరును ఆయన పరిశీలించారు. ఈ వ్యవస్థ ఎంత సులభంగా ఉందో కండక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. హైదరాబాద్​లో అమలు చేస్తున్న ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్​ను త్వరలో రాష్ట్రవ్యాప్తంగా తీసుకువస్తున్నట్లు చెప్పారు. 

త్వరలో ఔటర్ రింగ్ రోడ్డు లోపల మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు నడిపేలా ఆర్టీసీ చర్యలు తీసుకుంటుందన్నారు. కొత్త కాలనీలకు సైతం ప్రజా రవాణా సేవలను విస్తరిస్తున్నామని, అందుకు ఆర్టీసీ అధికారులను కాలనీవాసులు సంప్రదించాలని సూచించారు. అనంతరం ముషీరాబాద్ డిపోలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులను సత్కరించారు. ఆర్టిసీ ఈడీలు మునిశేఖర్, వెంకన్న, రాజశేఖర్, విజయ పుష్ప, ఉషాదేవి, శ్రీదేవి, సుధా, పరిమళ తదితరులు పాల్గొన్నారు.

త్వరలో డిజిటల్​ బస్సు పాస్​లు 

ప్రస్తుతం క్యూఆర్ కోడ్ టికెట్ అందుబాటులో ఉందని, త్వరలోనే వాట్సాప్ టికెటింగ్, డిజిటల్ బస్సు పాస్​ల సదుపాయాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ వెల్లడించారు. వాట్సాప్​లో ప్రయాణ వివరాలను నమోదు చేసి, సులువుగా టికెట్లు పొందవచ్చన్నారు. టెక్నాలజీకి అనుగుణంగా ఆర్టీసీ అప్​డేట్​ అవుతోందన్నారు.