తాడేపల్లి గ్యాంగ్ రేప్ ఏ-1 నిందితుడి అరెస్ట్

తాడేపల్లి గ్యాంగ్ రేప్ ఏ-1 నిందితుడి అరెస్ట్
  • జూన్ 19న కాబోయే భర్తతో కృష్ణా నది తీరంలో నిర్జన ప్రదేశానికి వచ్చిన బాధితురాలు
  • ఏకాంతంగా కనిపించిన జంటపై బ్లేడుతో దాడి చేసిన నిందితులు
  • కాబోయే భర్తను కట్టేసి.. అతని ఎదుటే అత్యాచారం చేసి పరారైన నిందితులు 
  • రెండు నెలల క్రితం కనిపించి పట్టుకునేందుకు ప్రయత్నించగా గూడ్స్ రైలు ఎక్కి పరార్
  • నిందితుడ్ని మీడియా ఎదుట ప్రవేశపెట్టిన గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్

గుంటూరు:  తాడేపల్లి వద్ద కృష్ణా నది తీరంలో యువతిపై గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు కృష్ణ కిశోర్, ఏ-2 నిందితుడు షేక్ హబీబ్ ఎట్టకేలకు పోలీసులకు పట్టుపడ్డారు. రైల్వే ట్రాక్ బ్రిడ్జిల వద్ద తలదాచుకుంటూ.. ఎట్టకేలకు విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద పోలీసులకు చిక్కారు. నిందితులను గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ శనివారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. నిందితులకు సంబంధించిన ఆధారాలు దొరకనందువల్లే అరెస్టు ఆలస్యమైందని ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ వివరించారు. 
తాడేపల్లి గ్యాంగ్ రేప్ బాధితురాలు తన కాబోయే భర్తతో గత జూన్ నెల 19వ తేదీన కృష్ణా నది తీరానికి రాగా.. నిందితులు బ్లేడ్లతో దాడి చేసి గాయపరిచి, అనంతరం ఆమె కాబోయే భర్తను తాళ్లతో బంధించి.. అతడి ఎదుటే యువతిపై అత్యాచారం జరిపారు. వారు ప్రతిఘటించకుండా ఇద్దరి వద్ద మొబైల్ ఫోన్లు, చెవి దుద్దులు, డబ్బులు తీసుకుని నాటు పడవలో కృష్ణా నదిలో పరారైపోయాక బాధితులిద్దరూ రోడ్డుపైకి వచ్చి స్థానికుల సహాయంతో కుటుంబ సభ్యులకు, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. ఘటనపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగిన నేపధ్యంలో పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి విచారణ చేపట్టగా.. సీతానగరం కు చెందిన కృష్ణ, అతని మిత్రుడు ఇద్దరూ ఘటన జరిగినప్పటి నుంచి కనిపించకుండా పోయినట్లు గుర్తించారు. యువతి, ఆమెకు కాబోయే భర్త దగ్గర లాక్కున్న మొబైల్ ఫోన్లను నిందితులు దాస్ అనే వ్యక్తి వద్ద తాకట్టుపెట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఘటన జరిగినప్పటి నుంచి వీరు పరారీలోనే ఉండడంతో వీరే ప్రధాన నిందతులన్న అనుమానాలు బలపడ్డాయి.
గ్యాంగ్ రేప్ కు ముందు చోరీ చేస్తుంటే చూశాడని ఓ వ్యక్తిని హత్య చేసిన నిందితులు
నిందితులు తమకు ఏకాంతంగా కనిపించిన జంటపై దాడి చేసి అత్యాచారం చేయడానికి ముందు ఓ హత్య చేశారు. రాగి తీగలు చోరీ చేస్తుంటే చూశాడని శనక్కాయలు అమ్మే వ్యక్తిని వీరు చంపేసి... ఆ మృతదేహాన్ని కృష్ణా నదిలో పడేశారు. ఆ తర్వాత కృష్ణా నది తీరంలోనే తలదాచుకుని ఉండగా.. యువతి తనకు కాబోయే భర్తతో ఏకాంతంగా గడిపేందుకు రావడం వీరి కంటపడింది. దీంతో తమ వద్ద జేబులో ఉన్న బ్లేడునే ఆయుధంగా చేసుకుని ఇద్దరిపై దాడి చేసి వారి ఫోన్లు లాక్కున్నారు. ఆ తర్వాత యువతి కాబోయే భర్తను తాడుతో కట్టేసి... అరిస్తే చంపేస్తానని బ్లేడుతో బెదిరించి అతడి ఎదుటే అత్యాచారం చేశారు. ఆ తర్వాత వారిని వదిలి వెళ్లే ముందు వారి వద్ద చైను, రింగులు, పర్సులోని డబ్బులు తీసుకుని నాటు పడవలో కృష్ణా నదిలో పరారై పోయారు. 

గ్యాంగ్ రేప్ నిందితుల్లో ప్రధాన నిందితుడు కృష్ణ కిశోర్, షేక్ హబీబ్ స్థానికంగానే సంచరించినట్లు తెలుస్తోంది. రైల్వే ట్రాక్ ల వెంట జన సంచారం ఉండదని గుర్తించి ట్రాక్ బ్రిడ్జిల కింద తలదాచుకుంటూ గడిపడం వల్లే వీరి ఆచూకీ కనుక్కోవడం కష్టమైందని పోలీసు వర్గాల కథనం. నిందితులు రేప్ కు ముందు హత్య చేసిన విషయాన్ని పోలీసుల విచారణలో అంగీకరించినట్లు జిల్లా ఎస్పీ ఆరిఫ్ వెల్లడించారు. నిందితుడిపై గతంలోనే చిల్లర నేరాలు, చోరీలు, దాడుల వంటి కేసులు ఉన్నాయని.. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు .