వీ6 వాళ్లు ఎక్కువ ప్రశ్నలు అడగొద్దు.. మంత్రి తలసాని రుసరుస

వీ6 వాళ్లు ఎక్కువ ప్రశ్నలు అడగొద్దు.. మంత్రి తలసాని రుసరుస
  • నా ఆఫీసుకొస్తే మీకు అన్ని చెబుతానంటూ ఆగ్రహం
  • మా స్థానంలో మీరుండి గెలిస్తే అప్పుడు తెలుస్తదని అసహనం
  • సమస్యలు ఉన్నాయని చెబితే, మీరు పోయి తీర్చండంటూ ఫైర్‌‌

హైదరాబాద్, వెలుగు: డబుల్‌‌ బెడ్రూమ్‌‌ ఇండ్లలో సమస్యల గురించి ప్రశ్నించిన ‘వీ6’జర్నలిస్టుపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌‌ రుసరుసలాడారు. వీ6 వాళ్లు ఎక్కువ ప్రశ్నలు అడగొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘డబుల్ బెడ్రూం ఇండ్లలో నీళ్లు రాకపోతే నీవు తీసుకపోయి ఇయ్యి. ‘వీ6’వాళ్లకు చెబుతున్నా.. ప్రెస్ కాన్ఫరెన్స్‌‌కి వస్తే ఒకటి రెండు ప్రశ్నలు అడగండి. అందరిని డామినేట్ చేసేలా ఉన్నవన్నీ అడిగితే ఎట్ల? నీ ఒక్కనితోనే మాట్లాడాలంటే.. నీవు నేను వెళ్లి మాట్లాడుకుంటాం కదా.. నా ఆఫీసుకు వస్తే ఏది అడిగితే అది చెబుతా. ఎందుకు నువ్వు మాట్లాడతావు. 

నేను పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ ఏంది.. నీవు అడుగుతున్నదేంది.. నీ ఒక్కనితోనే మాట్లాడాలా?’’అంటూ మంత్రి తలసాని ‘వీ6’రిపోర్టర్‌‌‌‌పై మండిపడ్డారు. హైదరాబాద్‌‌లోని జియాగూడలోని డబుల్‌‌ బెడ్రూమ్‌‌ ఇండ్లలో అనేక సమస్యలు ఉన్నాయని, ప్రధానంగా వాటర్ రావడం లేదని ప్రశ్నించినందుకు ఆయన ఇలా ఫైర్ అయ్యారు. ఇప్పటికే పంపిణీ చేసిన డబుల్‌‌ ఇండ్లల్లో సమస్యలు ఉన్నాయని ప్రశ్నించగా.. మీరెల్లి సమస్యను తీర్చండని మీడియా ప్రతినిధులకు వార్నింగ్ ఇచ్చారు. 

తమ స్థానంలో మీరుండి గెలిస్తే తెలుస్తుందని, అక్కడ కూర్చోని మాట్లాడటం కాదని అసహనం వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌‌లో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి సంబంధించి జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. డబుల్ బెడ్రూం ఇండ్లలో సమస్యలు ఉన్నాయని, లబ్ధిదారుల ఎంపికలో జాప్యం జరిగిందని, 7 లక్షల దరఖాస్తుల్లో 95 వేల మందే అర్హులుగా ఉండటమేంటని మీడియా ప్రశ్నించగా.. మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అన్ని పరిశీలించే అర్హులను గుర్తించాం.. 

గ్రేటర్‌‌‌‌లో డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం 7 లక్షల దరఖాస్తులు వచ్చాయని, అందులో 95 వేల మంది అర్హులుగా గుర్తించామని తలసాని తెలిపారు. మిగతా వారిలో కొందరు వేరే జిల్లాలకు చెందిన వారున్నారని, ఇంకొందరు ఒకే ఇంటికి చెందిన 7, 8 మంది దరఖాస్తులు చేసుకున్నారని, అన్ని పరిశీలించిన తర్వాతే అర్హులను గుర్తించామని చెప్పారు. గ్రేటర్‌‌‌‌లో ఇప్పుడు సిద్ధంగా ఉన్న 65 వేల ఇండ్లను విడతల వారీగా పంపిణీ చేస్తామని తెలిపారు.

 ఇండ్లురాని వారు ఏడవొద్దని, పరేషాన్ కావొద్దని సూచించారు. ఇండ్ల పంపిణీ నిరంతరాయంగా జరుగుతుందని, లబ్ధిదారుల ఎంపిక ఆన్‌‌లైన్ ద్వారా ర్యాండమ్‌‌గా జరిగిందని చెప్పారు. ఎంపికలో అవకతవకలు జరిగాయన్నది అవాస్తవమని తెలిపారు. శనివారం 9 ప్రాంతాల్లో 11,700 ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నామని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో హైదరాబాద్‌‌ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌‌‌‌ మోతే శ్రీలతరెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్‌‌ తదితరులు పాల్గొన్నారు.

జమిలి ఎన్నికలకు మేం సిద్ధం..

దేశంలోని ఏ రాష్ట్రంలో బీజేపీ గెలిచే అవకాశం లేదని మంత్రి తలసాని అన్నారు. ఉన్నట్లుండి వేవ్‌‌ను మార్చితే ఫలితాలు మారుతాయని బీజేపీ అనుకుంటోందని, అందుకే జమిలి ఎన్నికలు అంటుందని పేర్కొన్నారు. గురువారం జీహెచ్ఎంసీ ఆఫీసు వద్ద ఆయన మాట్లాడుతూ, రేపు షెడ్యూల్ ఇచ్చి ఎన్నికలు పెట్టినా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాబోయే లోక్‌‌సభ ఎన్నికల్లో ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’పేరుతో బిల్లు పెడతారనే సమాచారం ఉందన్నారు. ఏ ఎన్నికలైనా కేసీఆర్ సర్కార్ సిద్ధంగా ఉందన్నారు. బీజేపీ ఓడిపోతుందని రిపోర్ట్స్ వాళ్లకు వచ్చాయని, అందుకే అసెంబ్లీ- పార్లమెంట్ కలిపి ఎన్నికలు పెడితే వాళ్లకు లాభం జరుగుతుందనే ఆలోచనతో ఉన్నారన్నారు.