తలసేమియా, సికిల్‌‌ సెల్‌‌ మందులు బంద్‌‌..జూన్‌‌లో పంపిణీ చేసి ఆ తర్వాత ఆపేసిన ప్రభుత్వం

తలసేమియా, సికిల్‌‌ సెల్‌‌ మందులు బంద్‌‌..జూన్‌‌లో పంపిణీ చేసి ఆ తర్వాత ఆపేసిన ప్రభుత్వం
  • సర్కార్‌‌ హాస్పిటల్స్‌‌లో టెస్ట్‌‌లు సైతం అందుబాటులో లేని వైనం
  • ప్రైవేట్‌‌లో ప్రతి నెల రూ. 5వేలకు పైగా ఖర్చు చేస్తున్న బాధితులు
  • మందులు సప్లై చేయడంతో పాటు, దివ్యాంగ పెన్షన్‌‌ మంజూరు చేయాలని వేడుకోలు

మంచిర్యాల, వెలుగు : తలసేమియా, సికిల్‌‌సెల్‌‌ బాధిత పిల్లలకు వైద్యం చేయించడం తల్లిదండ్రులకు తలకు మించిన భారంగా మారింది. మందుల సప్లైని ప్రభుత్వం నిలిపివేయడం, అవసరమైన టెస్ట్‌‌లు సర్కార్‌‌ హాస్పిటల్స్‌‌లో అందుబాటులో లేకపోవడంతో బాధితులు తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్‌‌ను ఆశ్రయిస్తున్నారు. మందులు, టెస్ట్‌‌ల కోసం ప్రతి నెల రూ. 5 వేల నుంచి రూ.10 వేలు ఖర్చు చేయాల్సి వస్తుండడంతో పేదలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

కొందరు తమకున్న కొద్దిపాటి ఆస్తులను అమ్ముకొని వైద్యం చేయిస్తుండగా.. మరికొందరు అప్పులు చేసి పిల్లలను కాపాడుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌‌ జిల్లాలో 2 వేల మంది బాధితులు ఉండగా.. రాష్ట్ర వ్యాప్తంగా వీరి సంఖ్య 10 వేలకుపైనే ఉంటుంది.

నిలిచిన మందుల సప్లై

తలసేమియా, సికిల్‌‌ సెల్‌‌ బాధితులను దివ్యాంగులుగా గుర్తించిన ప్రభుత్వం వారికి యూనిక్‌‌ డిజేబిలిటీ ఐడెంటిటీ కార్డు (యూడీఐడీ)లను జారీ చేస్తోంది. రానున్న రోజుల్లో ఈ వ్యాధులను పూర్తిగా నిర్మూలించడానికి పలు కార్యక్రమాలు చేపట్టడంతో పాటు బాధితులకు అవసరమైన వైద్యం, మందులు ఫ్రీగా అందించాలని ఆదేశించింది. ఈ ఏడాది జూన్‌‌ 19న వరల్డ్‌‌ సికిల్‌‌ సెల్‌‌ డే సందర్భంగా హైడ్రాక్సీ యూరియా ట్యాబ్లెట్స్‌‌తో పాటు సోడామింట్, పెంటిడ్స్‌‌ వంటి మరికొన్ని సప్లిమెంట్స్‌‌ను జూన్‌‌లో ఒకే విడత పంపిణీ చేసి ఆ తర్వాత నిలిపివేశారు. 

మరో వైపు సికిల్‌‌ సెల్‌‌ బాధితులు రెగ్యులర్‌‌గా చేయించుకోవాల్సిన టీటీఎన్‌‌ఆర్‌‌, హెచ్‌‌ఐవీ, ఎలీసా, సీరమ్‌‌ క్రియాటిన్‌‌, కిడ్నీ, లివర్‌‌ ఫంక్షన్‌‌ వంటి బ్లడ్‌‌ టెస్ట్‌‌లు సైతం సర్కార్‌‌ హాస్పిటల్స్‌‌లో అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో బాధితులు తప్పనిసరిగా ప్రైవేట్‌‌ హాస్పిటల్స్‌‌ను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేట్‌‌లో ఈ టెస్ట్‌‌లన్నీ చేయించుకోవాలంటే రూ. 5 వేలకు పైగానే ఖర్చవుతోంది. దీంతో కూలి పనులు, చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవించే తల్లిదండ్రులు తమ పిల్లలకు టెస్ట్‌‌లు చేయించడం, మందులు కొనడం కోసం నానా పాట్లు పడుతున్నారు.

 బీపీ, షుగర్, జ్వరం మందులను సర్కార్‌‌ హాస్పిటల్స్‌‌లో ఎలాగైతే సప్లై చేస్తున్నారో.. అదే విధంగా తలసేమియా, సికిల్‌‌సెల్‌‌ మందులను సైతం సప్లై చేయాలని బాధితుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయమై పలుమార్లు ఆఫీసర్లకు విన్నవించినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నా బిడ్డను ప్రభుత్వమే బతికించాలె 

నా కూతురు పల్లవికి ఏడాది వయసులోనే సికిల్‌‌ సెల్‌‌ వ్యాధి ఉన్నట్లు తేలింది. అప్పటి నుంచి నెలనెలా రక్తం ఎక్కిస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నా. కొన్ని రోజులుగా పాప ఆరోగ్యం క్షీణించింది. మంచిర్యాల రెడ్ క్రాస్ బ్లడ్‌‌ బ్లాంక్‌‌లో రక్తం ఫ్రీగా ఎక్కిస్తున్నప్పటికీ... టెస్టులు, మందుల కోసం రూ. 5 వేలకు పైగా ఖర్చవుతోంది. కూలి పనులు చేసుకుంటూ జీవించే మేము చిన్నారి వైద్యం కోసం ప్రతి నెలా అప్పు చేయాల్సి వస్తోంది. 

పాపకు ఇటీవల గుండెలో వాపు వచ్చింది. ఒక కాలు వంకరపోయి నడవలేకపోతోంది. ఆపరేషన్‌‌ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదమని, ఇందుకు రూ.20 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు అంటున్నారు. ప్రభుత్వం సాయం అందించి మా పాపను రక్షించాలి.     - కోడి శోభారాణి రాంపూర్‌‌, జన్నారం మండలం

విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వాలె 

నాకు నాలుగేండ్ల వయసులో సికిల్‌‌ సెల్‌‌ వ్యాధి ఉన్నట్లు తేలింది. 27 ఏండ్ల నుంచి రక్తం ఎక్కించుకుంటూ, మందులు వాడుతూ ప్రాణాలు నిలుపుకుంటున్నా. తలసేమియా బాధితులకు ప్రతినెలా రక్తం ఎక్కించడం, మందుల కోసం రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చవుతుంది. మాలాంటి పేదలకు అది మోయలేని భారం. ప్రభుత్వం స్పందించి దివ్యాంగుల పెన్షన్‌‌ మంజూరు చేయడంతో పాటు నెలనెలా మందులను ఫ్రీగా సప్లై చేయాలి. తలసేమియా, సికిల్‌‌ సెల్‌‌ బాధితులను దివ్యాంగులుగా గుర్తించినందున విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలె.- బండ అవినాశ్, సికిల్‌‌సెల్‌‌ బాధితుడు, రామకృష్ణాపూర్​