విషాదం: ఈతకు వెళ్లి జ‌ల‌పాతంలో ఇద్ద‌రు గ‌ల్లంతు.. ఒక‌రు మృతి

విషాదం: ఈతకు వెళ్లి జ‌ల‌పాతంలో ఇద్ద‌రు గ‌ల్లంతు.. ఒక‌రు మృతి

మ‌హారాష్ట్ర లోని థానే జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ముర్బాద్ తాలూకాలోని జలపాతంలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వారిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యం కాగా, మరొకరి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. అంబోలి గ్రామానికి చెందిన 12 మంది యువకులు గురువారం మధ్యాహ్నం ఖోపివిలిలోని జలపాతంలో ఈత కొట్టడానికి వెళ్లారు. అందులో ఉమేశ్‌ బొట్కుడ్లే(25), కార్తీక్‌ గాడ్గే(25)అనే ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు జలపాతంలో పడిపోయారు. గల్లంతైనవారి కోసం వారి స్నేహితులు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. దీంతో స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ టీం గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టగా ఉమేశ్‌ మృతదేహం లభించింది. కార్తీక్‌ కోసం వెతుకుతున్నట్లు ముర్బాద్ పోలీస్ స్టేషన్ హౌస్ అధికారి శుక్రవారం తెలిపారు. దీంతో థానే, పాల్ఘర్ జిల్లాల కలెక్టర్లు వానకాలంలో ఇలాంటి ప్రమాదాలను నివారణకు చర్యలు చేపట్టారు. జల ప్రవాహం కలిగిన ప్రాంతాల వద్ద ఎవరినీ అనుమతించవద్దని ఉత్తర్వులు జారీ చేశారు.