
జయం రవి, నయనతార జంటగా నటించిన తమిళ చిత్రం ‘తనీ ఒరువన్’. అరవింద్ స్వామి విలన్‌గా నటించిన ఈ చిత్రానికి ‘గాడ్ ఫాదర్’ ఫేమ్ మోహన్ రాజా దర్శకత్వం వహించాడు. 2015లో వచ్చిన ఈ సినిమా తమిళంలో సూపర్ సక్సెస్ సాధించింది. ఇదే సినిమా రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ధ్రువ’గా తెలుగులో రీమేక్ అయింది. ‘తనీ ఒరువన్’ చిత్రం విడుదలై సోమవారంతో ఎనిమిదేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా దీనికి సీక్వెల్‌ను అనౌన్స్ చేశారు.
ఈసారి కూడా జయం రవికి జంటగా నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఆ చిత్రాన్ని నిర్మించిన ఎజిఎస్ ప్రొడక్షన్స్ సంస్థ సీక్వెల్‌ని నిర్మిస్తోంది. మోహన్ రాజా డైరెక్షన్‌లో నయనతార నటించడం ఇది నాలుగోసారి. తన తమ్ముడు జయం రవితో మోహన్ రాజా తీస్తున్న ఏడవ సినిమా ఇది. అనౌన్స్‌మెంట్ వీడియో సీక్వెల్‌పై ఆసక్తి రేపుతోంది. ఇక ‘తనీ ఒరువన్’లో అరవింద్ స్వామి నటన ఆ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. మరి ఈసారి విలన్‌గా ఎవరు నటిస్తారో చూడాలి!