- 93 ఏండ్ల వయస్సులో వివాదాస్పద కేసులో విజయం
ముంబై : పూర్వీకుల ఆస్తి కోసం ఓ మహిళ(93) అలుపెరుగని పోరాటం చేసింది. తన ఆస్తిని కబ్జా చేసిన వాళ్లను చట్టం సాయంతోనే ఓడించింది. న్యాయం కోసం 80 ఏండ్లుగా కోర్టు చుట్టూ తిరిగి తిరిగి.. చివరకు విజయం సాధించింది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని ముంబైలో ఉన్న బరాక్ రోడ్డు ప్రాంతంలోని రూబీ మాన్షన్ బిల్డింగ్, మొదటి అంతస్తులో ఆలిస్ డిసౌజా ఫ్యామిలీ ఉండేది. అందులో వారికి 500, 600 చదరపు అడుగుల విస్తీర్ణం గల రెండు ఫ్లాట్లు ఉన్నాయి. అయితే, ఆ బిల్డింగును1942 మార్చి 28న అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ (రిక్విజిషన్– ప్రైవేటు ఆస్తులను స్వాధీనం చేసుకోవడం)కింద తన ఆధీనంలోకి తెచ్చుకుంది. బిల్డింగులోని అన్ని ఫ్లాట్లను గవర్నమెంటు ఆఫీసర్లకు ఇచ్చేసింది. అలా.. అలిస్ డిసౌజా ఫ్యామిలీకి చెందిన ఫ్లాట్లను సివిల్ సర్వీస్ డిపార్ట్ మెంటులో పనిచేసే డీఎస్ లాడ్ అనే ఆఫీసర్‌కు అప్పగించింది. అయితే, 1946 జులైలో రిక్విజిషన్ ఆదేశాలను బ్రిటీష్ ప్రభుత్వం ఎత్తివేసింది. దాంతో రూబీ మాన్షన్ బిల్డింగులోని ఫ్లాట్లను తిరిగి అసలైన ఓనర్లకు అప్పగించారు. కానీ లాడ్ ఫ్యామిలీ మాత్రం ఈ ఫ్లాట్లను ఖాళీ చేయడానికి ఒప్పుకోలేదు. వాళ్లను వెంటనే తమ ఫ్లాట్ల నుంచి ఖాళీ చేయించాలని ఆలిస్ డిసౌజా అప్పటి ముంబై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి దాకా ఈ ఆస్తి వివాదం కొనసాగుతూ వచ్చింది. ఏ కలెక్టరు చెప్పినా.. ఏ అథారిటీలు ఆదేశాలిచ్చినా లాడ్ వారసులు ఫ్లాట్లను తిరిగి ఆలిస్ డిసౌజాకు అప్పగించలేదు.
చివరగా బాంబే హైకోర్టుకు..
తన ఆస్తిని దక్కించుకునేందుకు ఆలిస్ డిసౌజా చివరకు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. 1946 జులైలో ఇచ్చిన డి-రిక్విజిషన్ ఉత్తర్వులను అమలు చేయాలని, తమ ఫ్లాట్‌లను వెంటనే తిరిగి అప్పగించాలని కోరుతూ పిటిషన్ వేశారు. ‘‘రిక్విజిషన్ ఉత్తర్వులను వాపస్ తీసుకున్న తర్వాత ఆ బిల్డింగులోని ఫ్లాట్లను అసలైన ఓనర్లకు అప్పగించారు. మా ఫ్లాట్లను మాత్రం తిరిగి పొందలేకపోయాం’’ అని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ ఆర్‌డీ ధనుక, ఎంఎం సతయేలతో కూడిన డివిజన్ బెంచ్ ఇటీవల విచారణ జరిపి.. తాజాగా తీర్పును వెల్లడించింది. రెండు వారాల్లో ఆ రెండు ఫ్లాట్లను ఖాళీ చేయించి ఆలిస్ డిసౌజాకు అప్పగించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశింది. దాంతో 80 ఏండ్లుగా ఆలిస్ డిసౌజా చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కినట్లయ్యింది.