ఢిల్లీ ఆర్డినెన్స్ : మోడీ స‌ర్కార్‌పై ఆప్‌, తృణమూల్ కాంగ్రెస్ ఫైర్

ఢిల్లీ ఆర్డినెన్స్ : మోడీ స‌ర్కార్‌పై ఆప్‌, తృణమూల్ కాంగ్రెస్ ఫైర్

ఢిల్లీ ప్రభుత్వ అధికారుల బ‌దిలీలు, పోస్టింగ్‌ల‌పై ప‌ట్టు కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ సార‌థ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్రంపై పోరాటాన్ని తీవ్రత‌రం చేసింది. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా విపక్షాల మ‌ద్దతు కూడ‌గ‌డుతోంది. 

త‌మ బిల్లుల‌న్నీ రాజ్‌భ‌వ‌న్‌లో మ‌గ్గుతున్నాయ‌ని త‌మిళ‌నాడు సీఎం చెబుతున్నార‌ని, ఇది కేవ‌లం త‌మ పోరాట‌మే కాద‌ని ఇది దేశవ్యాప్త పోరాట‌మ‌ని సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీ పోలీసులు మ‌నీష్ సిపోడియాను ఎలా ట్రీట్ చేశారో అందరూ చూశార‌ని అన్నారు. 

ఢిల్లీలో బ్యూరోక్రాట్‌ల పోస్టింగ్‌, బ‌దిలీల‌పై నియంత్రణ కోసం కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా విప‌క్షాల మ‌ద్దతు కూడ‌గ‌ట్టేందుకు కేజ్రీవాల్ పలు రాష్ట్రాల్లో ప‌ర్యటించ‌నున్నారు.

అధికారుల బ‌దిలీలు, పోస్టింగ్‌ల కోసం కేంద్రం నేష‌న‌ల్ క్యాపిట‌ల్ సివిల్ స‌ర్వీస్ అథారిటీ ఏర్పాటు దిశ‌గా ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆప్ పార్టీ... బీజేపీయేత‌ర పార్టీల మ‌ద్దతును కోరుతోంది. రాజ్యాంగాన్ని కాపాడాల‌నుకునే పార్టీలు ముందుకు రావాల‌ని ఆప్ పిలుపు ఇచ్చింది. ఢిల్లీ ప్రభుత్వ అధికారాల‌ను కుదిస్తూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను టీఎంసీ కూడా వ్యతిరేకించింది.

మే 23వ తేదీ మంగళవారం ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రివాల్‌ నేతృత్వంలో ఆప్‌ బృందం కోల్‌కతా వెళ్లి మమతాబెనర్జిని కలిసింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ పాటు పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌, ఎంపీ రాఘవ్‌ చద్దాతో పాటు ఢిల్లీ మంత్రులు కూడా ఉన్నారు.

ఢిల్లీలో అధికారాలకు సంబంధించి సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆ తీర్పునకు విరుద్ధంగా ఆర్డినెన్స్‌ తీసుకురావడంపై కేజ్రీవాల్.. మమతాబెనర్జితో చర్చించారు. ఈ విషయంలో కేంద్రంపై ఢిల్లీ సర్కారు చేసే పోరాటినికి మద్దతు నిలువాలని కోరారు. ఈ భేటీ సందర్భంగా మమతాబెనర్జి మాట్లాడుతూ.. బీజేపీపై విమర్శలు గుప్పించారు.

కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో గవర్నర్‌లు, ఆర్డినెన్స్‌లు, లెటర్‌ల ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాలను పరిపాలించేలా ఉందని మమతాబెనర్జి ఎద్దేవా చేశారు. కలిసి పనిచేద్దామనే ఉద్దేశం ఉంటే బీజేపీయేతర పార్టీలన్నీ ఒక్క తాటిపైకి రావాలన్నారు. బీజేపీకి ఒక్క ఓటు కూడా పడనీయకుండా కలిసికట్టుగా పనిచేయాలని కోరారు.

https://twitter.com/ANI/status/1660986508223066118