వరద నష్టం వరికే ఎక్కువ!..లక్ష ఎకరాల్లో నీట మునిగిన వరి పంట

వరద నష్టం వరికే ఎక్కువ!..లక్ష ఎకరాల్లో  నీట మునిగిన వరి పంట
  • మొత్తంగా 2.36 లక్షల ఎకరాల్లో పంట నష్టం
  • 28 జిల్లాల్లోని 2,680 గ్రామాలపై ప్రభావం
  • 1.49 లక్షల మంది రైతులకు తీవ్ర నష్టం
  • పంట నష్టం రూ.236 కోట్లుగా వ్యవసాయ శాఖ అంచనా

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలతో 28 జిల్లాల్లోని వరి పంటకే తీవ్ర నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ గుర్తించింది. ప్రధానంగా 2,680 గ్రామాల్లో పంట నీట మునిగింది. 1,49,916 మంది రైతులకు సంబంధించిన మొత్తం 2,36,456 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఏఈవోలు ప్రాథమికంగా నిర్ధారించారు. భారీ వర్షాల కారణంగా చెరువులు, కుంటలు తెగడంతో నష్టం సంభవించింది. చాలా చోట్ల పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో సాగుకు పనికిరాకుండా పోయింది. 1,18,190 ఎకరాల వరి నీట మునిగినట్లు అధికారులు గుర్తించారు. కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సూర్యాపేట, సిద్ధిపేట, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని రైతులు తీవ్రంగా ప్రభావితం అయ్యారు. వరితో పాటు పత్తి, మొక్కజొన్న, సోయాచిక్కుడు, కంది, పెసర, మినుము, హార్టికల్చర్ పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ తేల్చింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, మంచిర్యాల జిల్లాల్లో 58,889 ఎకరాల పత్తి నష్టపోయింది. ఆదిలాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో 8,123 ఎకరాల్లో వేసిన కంది, పెసర, మినుము పంటలకు నష్టం వాటిల్లింది. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో సాగు చేస్తున్న సోయా పంట నీట మునిగింది. 1,408 ఎకరాల్లో వేసిన కూరగాయలు, పండ్లు, పూల తోటలు నీట మునిగాయి. 6,479 ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయని వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు.

నష్టంపై త్వరలో ఫీల్డ్ లెవల్ సర్వే

నిరుడు నుంచి పంట నష్ట పరిహారం కింద ఎకరానికి రూ.10వేల చొప్పున పరిహారం అందిస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాల్లో రూ.235.45 కోట్ల విలువైన పంట నష్టపోయినట్టు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు త్వరలో పంట నష్టంపై ఫీల్డ్ లెవల్ సర్వే పూర్తి చేసి రిపోర్ట్​ను ప్రభుత్వానికి అందించనున్నది. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులకు అన్యాయం జరగకుండా, సకాలంలో సాయం అందిస్తామన్నారు. అందుకోసం పంట నష్టం సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని, 5 రోజుల్లోగా పూర్తి నివేదికను సమర్పించాలని వ్యవసాయశాఖ అధికారులకు మంత్రి ఆదేశించారు. అదేవిధంగా, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో కలిసి ఢిల్లీకి వెళ్లి ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జరిగిన పంట, ఆస్తి నష్ట్రాన్ని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నారు.