రాజ్యాంగంపై అవగాహన కల్పించడమే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ లక్ష్యం: వేణుగోపాల్

రాజ్యాంగంపై అవగాహన కల్పించడమే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ లక్ష్యం: వేణుగోపాల్

బషీర్​బాగ్, వెలుగు: రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వేణుగోపాల స్వామి అన్నారు. ఆదివారం ఖైరతాబాద్  నియోజకవర్గంలోని లిబర్టీ తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద  జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద, బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని తెలిపారు. ప్రధాని మోదీకి పేదల కంటే బడా బాబులు ముఖ్యమని విమర్శించారు. 

రాజ్యాంగం కేవలం పుస్తకం కాదని, అంబేద్కర్, గాంధీ, పూలే వంటి గొప్పవాళ్ల ఆలోచనలతో కూడిన ఒక పవిత్ర గ్రంథమని పేర్కొన్నారు. అమిత్ షా అంబేద్కర్ ను పార్లమెంట్ సాక్షిగా అవమానించారని ఆరోపించారు.  టీటీడీ ఆలయం నుంచి హిమాయత్ నగర్ వై జంక్షన్ వరకు పాదయాత్రగా వచ్చిన నాయకులు అక్కడ అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రాజు యాదవ్, అంబేద్కర్ సేన జాతీయ అధ్యక్షుడు మన్నె శ్రీధర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.