కాంగ్రెస్‌‌‌‌లో కలకలం రేపుతున్న పొత్తుల వ్యాఖ్యలు

కాంగ్రెస్‌‌‌‌లో  కలకలం రేపుతున్న పొత్తుల వ్యాఖ్యలు
  • జానారెడ్డి కామెంట్లపై భిన్న స్వరాలు
  • బీఆర్ఎస్‌‌‌‌తో పొత్తు ఉండదంటున్న రేవంత్ వర్గం
  • జానా మాటల్లో అర్థం వేరే ఉండి ఉంటుందన్న పీసీసీ చీఫ్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్‌‌‌‌లో పొత్తుల వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్‌‌‌‌తో పొత్తు విషయంలో కాంగ్రెస్‌‌‌‌ సీనియర్ నేత జానారెడ్డి చేసిన కామెంట్లు చర్చనీయాంశమవుతున్నాయి. రేవంత్ వర్గం తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తుండగా.. రేవంత్‌‌‌‌ వ్యతిరేక వర్గంగా చెప్పుకునే పలువురు సీనియర్ నేతలు పాజిటివ్‌‌‌‌గా రియాక్ట్ అవుతున్నట్టు తెలుస్తున్నది. తొలుత జానారెడ్డి వ్యాఖ్యలపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన రేవంత్.. ఆయన మాటల్లో అర్థం వేరే ఉండి ఉంటుందని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్‌‌‌‌తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. కానీ జానారెడ్డిని ఫాలో అయ్యే కార్యకర్తలు చాలా మంది.. ఆయన కామెంట్లను స్టేటస్‌‌‌‌లలో పెట్టుకున్నారు. పార్టీకి నష్టం జరుగుతుంటంతో.. హైకమాండ్ నిర్ణయం మేరకే పొత్తులుంటాయని జానారెడ్డి వివరణ ఇచ్చారు.

కోమటిరెడ్డి వ్యాఖ్యలతో షురూ

రాష్ట్రంలో ఏ పార్టీకీ మెజారిటీ రాదని, హంగ్ వస్తుందని గతంలో కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్​ సెక్యులర్ పార్టీ కాబట్టి.. ఆ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై పార్టీ రాష్ట్ర ఇన్​చార్జి ఠాక్రే ఆయనపై సీరియస్ అయ్యారు. తన సర్వేలో తేలిన విషయాన్ని చెప్పానే తప్ప.. బీఆర్ఎస్‌‌‌‌తో పొత్తు గురించి తాను కావాలని కామెంట్​ చేయలేదన్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు ఇటీవలి కాలంలో రేవంత్‌‌‌‌పై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారే తప్ప.. కాంగ్రెస్ పార్టీని అనడం లేదు. కేసీఆర్ కూడా ఇటీవల ఇందిరాగాంధీని ఉక్కుమనిషిగా పేర్కొన్నారు. సోనియా, రాహుల్ గాంధీపై విమర్శలు చేయడం తగ్గించారు. ఇటీవల రాహుల్​పై అనర్హత వేటు వేసినప్పుడు సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత.. ఇతర మంత్రులు సహా ఆయనకు మద్దతుగా నిలిచారు. ఈడీ, సీబీఐ కేసుల విషయంలోనూ కాంగ్రెస్​కు బీఆర్ఎస్ అండగా నిలిచింది. అదానీ వ్యవహారంపై పార్లమెంట్‌‌‌‌లో కాంగ్రెస్​తో కలిసి పోరాడుతున్నది. ఈ క్రమంలోనే జానారెడ్డి పొత్తు విషయం.. ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు అటు రాష్ట్రంలో హాట్ టాపిక్​గా మారింది.

‘జీ9’ లీడర్లకు ఇష్టమేనా?

వాస్తవానికి రేవంత్‌‌‌‌కు వ్యతిరేకంగా పార్టీలోని ‘జీ9’ నేతలు పనిచేస్తున్నారు. అవకాశం చిక్కినప్పుడల్లా రేవంత్‌‌‌‌పై విరుచుకుపడుతున్నారు. ఆ జీ9 నేతలకు బీఆర్ఎస్‌‌‌‌తో పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచన ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్నది. ఆ గ్రూప్​లోని కొందరు నేతలు బయటకు చెప్పకపోయినా.. జానా వ్యాఖ్యలపై పాజిటివ్‌‌‌‌గా రియాక్ట్ అవుతున్నట్టు సమాచారం. నిజానికి వాళ్లే బీఆర్ఎస్‌‌‌‌తో పొత్తు కోసం పావులు కదుపుతున్నట్టు గతంలో వార్తలు వినిపించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ఒంటరిగా గెలిచే పరిస్థితి లేదని, బీఆర్ఎస్‌‌‌‌తో కలిసి వెళ్తే కొన్ని సీట్లయినా గెలిచి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించవచ్చన్న యోచనలో జీ9 నేతలున్నట్టు తెలుస్తున్నది. కానీ రేవంత్ బీఆర్ఎస్‌‌‌‌తో పొత్తు ప్రసక్తే ఉండదని తేల్చిచెప్తున్నారు. పార్టీ నేతల వ్యాఖ్యలతో కేడర్, కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు