వడ్లు కొన్నరు.. పైసలు జమ చేయలే

వడ్లు కొన్నరు.. పైసలు జమ చేయలే
  • నెలలు గడుస్తున్నా ఖాతాల్లో డబ్బులు పడట్లే
  •  తీవ్ర ఇబ్బంది పడుతున్న రంగారెడ్డి జిల్లా రైతులు
  • ఇప్పటికే సగానికిపైగా మూతపడిన  కొనుగోలు కేంద్రాలు

రంగారెడ్డి, వెలుగు: రంగారెడ్డి జిల్లాలో రైతుల నుంచి యాసంగి వడ్లను కొనుగోలు చేసిన ప్రభుత్వం.. నెలలు గడుస్తున్నా  వారి ఖాతాల్లో ఇంకా డబ్బులు జమ చేయలేదు. దీంతో వరి సాగుకు అప్పు ఇచ్చినవారితో పాటు కూలీల నుంచి ఒత్తిళ్లు పెరుగుతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తమ ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు వేస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

నెరవేరని లక్ష్యం..

రంగారెడ్డి జిల్లాలో ఈ యాసంగిలో 71 వేల 273 మంది రైతులు 90 వేల 447 హెక్టార్లలో వరి సాగుచేశారు. దీంతో 2లక్షల26వేల118 మెట్రిక్​ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. రైతుల నుంచి సుమారు 60 వేల మెట్రిక్​ టన్నుల ధాన్యం సేకరించాలనే లక్ష్యంతో ఏప్రిల్ 21 నుంచి జిల్లాలోని పలు కేంద్రాల్లో 36  ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే, ఈ కేంద్రాలను చాలా ఆలస్యంగా ఏర్పాటు చేయడంతో పాటు తేమ, తాలు పేరుతో ఎక్కువ మొత్తంలో తరుగు తీయడం, సమయానికి రైతుల నుంచి సేకరించక వారాల కొద్దీ ఆపడం వంటి సమస్యలతో ధాన్యం కొనుగోలు సగానికి తగ్గింది. దీంతో అనుకున్న లక్ష్యం చేరుకోలేక ఇప్పటివరకు  సుమారు 32 వేలకు పైగా మెట్రిక్ ​టన్నుల ధాన్యాన్ని మాత్రమే ఈ కేంద్రాల్లో సేకరించారు. మరోవైపు జిల్లాలో సగానికి పైగా కేంద్రాల్లో కొనుగోలు పూర్తి కాగా వాటిని క్లోజ్ చేశారు. అయితే,  కొన్ని కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యం ఇంకా లారీల్లోనే ఉందని.. రైస్ మిల్లులకు చేరలేదని తెలుస్తోంది. ఆ ధాన్యం రైస్ మిల్లులకు చేరితేనే రైతులకు బిల్లులు వచ్చే అవకాశముంది.

నిర్వాహకుల కారణంగానే..

జిల్లాలో మొత్తంగా 5, 931 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశారు. ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం1,248 మంది రైతుల ఖాతాల్లో మాత్రమే సుమారు రూ.13 కోట్లను జమ చేసింది. మిగిలిన 4,683 మంది రైతుల ఖాతాల్లో డబ్బులు పడలేదు. ఆరుగాలం కష్టపడి ధాన్యం పండించి, ఆ తర్వాత కొనుగోలు సెంటర్లలో ఎన్నో వ్యయప్రయాసాలకు లోనై చివరికు ధాన్యం అమ్మితే.. నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఖాతాల్లో డబ్బులు పడలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్​లైన్ నమోదు, బిల్లులు ఇవ్వడంలో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు 
చేస్తున్న ఆలస్యం కారణంగా ఇంకా తమకు డబ్బులు అందడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.