అంగన్​వాడీలు ఆగమైతున్నయ్ : కోడం పవన్ కుమార్

అంగన్​వాడీలు ఆగమైతున్నయ్ : కోడం పవన్ కుమార్

గుక్కపెడుతున్న బాల్యాన్ని, తల్లడిల్లుతున్న మాతృత్వాన్ని సాంత్వన పరిచేందుకు ఏర్పాటు చేసిన అంగన్​వాడీలు నీరసించిపోతున్నాయి. దీంతో భావిపౌరుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తున్నది. పౌష్టికాహార లోపం వారి భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తున్నది. జనన సమయంతో మొదలవుతున్న ఈ సమస్య, పెరుగుతున్న బాల్యాన్ని అనేక వక్ర మార్గాలకు దారితీయిస్తున్నది. ఈ నేల మీద కన్ను తెరిచిన ప్రతి శిశువు సంపూర్ణ వ్యక్తిగా ఎదగడం కోసం కేంద్ర ప్రభుత్వం1975 గాంధీ జయంతి రోజు ప్రారంభించిన ఐసీడీఎస్ (సమీకృత శిశు అభివృద్ధి సేవల పథకం) లక్ష్యం పక్కదారి పడుతున్నది. ఆరేండ్లలోపు పిల్లలతో పాటు కిశోర బాలికలకు, బాలింతలకు, గర్భిణులకు ఏడాదిలో 300 రోజుల పాటు పౌష్టికాహారం అందిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద మాతాశిశు పోషక ప్రణాళికగా పేరుగడించింది. దేశవ్యాప్తంగా 13.89 లక్షల అంగన్​వాడీ కేంద్రాలు ఉంటే, తెలంగాణలో 35,700 కేంద్రాలున్నాయి. బాలబాలికల శారీరక, మానసిక ఎదుగుదల కోసం ఈ కేంద్రాలను నిర్దేశించినప్పటికీ, ఆచరణలో గాడి తప్పుతున్నాయి. నిధుల కొరత, సిబ్బంది అవినీతి, వేతన సమస్యలు, సొంత భవనాల కొరత, అనుచిత రాజకీయ పెత్తనం తదితర సమస్యలతో అంగన్​వాడీల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. టీకాలు, ఐరన్, ఫోలిక్ ఆసిడ్ వంటి సూక్ష్మ పోషకాలు అందుబాటులో ఉండకపోవడం, గర్భస్థ శిశురక్షణ, మంచి భోజనం సరఫరా వంటి సేవల్లో అంతరాయం అంగన్​వాడీ కేంద్రాల స్థితిగతుల్ని దిగజారుస్తున్నాయి. కొవిడ్ కాలంలో ఈ కేంద్రాల పరిస్థితి మరింత ఆందోళనకరం గా మారింది. కొవిడ్ ఉద్ధృతి చిన్నారుల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపింది. అంగన్​వాడీల ద్వారా వారు పూర్తి స్థాయి ఆహారాన్ని పొందలేకపోయారు. గర్భిణులు, బాలింతలదీ అదే పరిస్థితి. లాక్​డౌన్ కాలంలో 15 నెలల నుంచి 6 ఏళ్ల వయసున్న చిన్నారుల్లో 47 శాతం మందికి కేంద్రాల ద్వారా ఆహారం అందలేదు. ఫలితంగా 6 శాతం మందిలో బలహీనత తీవ్రమైంది. 43 శాతం మంది గర్భిణులు, బాలింతలకు కేంద్రాల ద్వారా ఆహారం అందలేదు. పిల్లలు, వారి సంరక్షకులపై కొవిడ్ ప్రభావం ఎలా ఉందనేదాని మీద కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ నిర్వహించిన అధ్యయనం వివరాలను నీతి అయోగ్ వెల్లడించింది. లాక్ డౌన్ కాలంలో 96 శాతం మంది శిశువులు ఆసుపత్రుల్లో ఊపిరిపోసుకున్నట్లు తెలిపింది. 12 శాతం మంది పిల్లలు అనారోగ్యానికి గురయ్యారు. 

పర్యవేక్షణ కొరవడి..

అంగన్​వాడీ కేంద్రాలకు ప్రతి నెలా స్త్రీ, శిశు సంక్షేమశాఖ ద్వారా 7 నెలల నుంచి 3 ఏండ్ల లోపు, 3 ఏండ్ల నుంచి 6 ఏండ్ల చిన్నారులకు బాలామృతం, కోడిగుడ్లు, భోజనం, పాలు, పప్పులు, మినీ భోజనం, పండ్లు, అల్పాహారం వంటివి అందిస్తున్నారు. ఇవన్నీ ఇస్తున్నా చిన్నారుల్లో వయస్సుకు తగిన ఎదుగుదల లేకపోవడంతో లోపం ఎక్కడనేది ఆందోళన కలిగిస్తున్నది. సాధారణంగా పిల్లలు 5 ఏండ్లు వేగంగా అభివృద్ధి చెందే వయసుగా వైద్య ఆరోగ్యశాఖ నిర్ధారించింది. ఈ దశలోనే వారి ఎత్తు, బరువులోనూ సమానంగా ఎదుగుతారు. అందుకు తగ్గట్లుగా పౌష్టికాహారం అందిస్తేనే ఆశించిన స్థాయిలో చిన్నారుల్లో ఎదుగుదల ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో పేదరికం, చిన్నారుల పెంపకం పట్ల అంతగా శ్రద్ధ తీసుకోకపోవడం, సరైన పౌష్టికాహారం అందించకపోవడంతో వారిలో ఎదుగుదల లోపిస్తుంది. అయితే ఇటీవల తెలంగాణలోని పలు జిల్లాల్లో నిర్వహించిన సర్వేలో అంగన్​వాడీల్లోని పిల్లల్లో ఎదుగుదల కానరావడం లేదు. చాలా మంది పిల్లలు సాధారణ బరువుతో ఉండటం, పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు తేలింది. ఇందుకు ప్రధాన కారణంగా కేంద్రాల్లోని కార్యకర్తలు పప్పు, ఆకుకూరలు, కూరగాయలతో పౌష్టికాహారం అందించా ల్సి ఉన్నా అవేవి పట్టించుకోకపోవడంతో పాటు సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడినట్లు తెలుస్తున్నది.

టీచర్లు, ఆయాలు లేక..

అంగన్ వాడీ కేంద్రాల్లో ఖాళీలు కూడా పథకం లక్ష్యాన్ని నీరుగారుస్తున్నది. చిన్నారులు, గర్భిణులకు పూర్తి స్థాయిలో సేవలు అందడం లేదు. ఖాళీగా ఉన్న టీచర్లు, ఆయాల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని ప్రభుత్వం పేర్కొంటున్నా, ఆచరణలో సాధ్యం కావడం లేదు. విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు, సిబ్బంది జీతభత్యాలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. మానవ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలైన శిశు, ప్రసూతి మరణాల రేటును తగ్గించడం, పిల్లల్లో శారీరక, మానసిక ఎదుగుదల లోపాలను నివారించడంలో అంగన్​వాడీలది కీలకపాత్ర. అయితే మన దేశంలో అంగన్​వాడీ వ్యవస్థలో ఉన్న 8.19 కోట్ల చిన్నారుల్లో 33 లక్షల మందికిపైగా చిన్నారులు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. వీరిలో సగం మందిలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. భావి భారత పౌరులను దేశానికి ఉపయోగపడే సమర్థ మానవ వనరులుగా తీర్చిదిద్దడానికి అనువైన పరిస్థితులను అంగన్​వాడీ కేంద్రాల్లో కల్పించాలి. వాటిని ఉన్నత ప్రమాణాలకు నెలవుగా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

కేంద్రాల్లో అనేక సమస్యలు..

అంగన్​వాడీ కేంద్రాల నిర్వహణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిఘా కొరవడటంతో వాటిల్లో తాగునీరు, మరుగు దొడ్లు, విద్యుత్ సమస్యలు పేరుకుపోయాయి. పసిపిల్లలు, గర్భిణులు, బాలింతలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సొంత భవనాలున్న కేంద్రాలకు కూడా నీటి సౌలత్​ లేకపోవడం బాధాకరం. మన రాష్ట్రంలో 12,122(33.95 శాతం) కేంద్రాలు అద్దె గదుల్లోనే ఇబ్బందుల మధ్య నడుస్తున్నాయి. దీంతో శిశు వికాసానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఈ పథకం సమర్థంగా అమలు కావాలంటే తగిన వసతులతో కూడిన కేంద్రాలుండాలి. అనేక కేంద్రాల్లో ఏండ్ల తరబడి మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. కొన్నింటిని ప్రాథమిక పాఠశాలలతో అనుసంధానం చేయడంతో చాలా కేంద్రాలు తరలిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ఒకేచోట రెండేసి కేంద్రాలు నిర్వహిస్తున్నారు. పాఠశాలల్లో, సొంత భవనాల్లో నడుస్తున్న వాటికి కొంతమేర సౌకర్యాలున్నా యి. మరికొన్ని చోట్ల కేంద్రాల నిర్వహణకు సొంత గదుల్లేవు. దీంతో ఒకే గదిలో రెండేసి కేంద్రాలను నిర్వహిస్తున్నారు. సొంత భవనాలు లేనిచోట ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కేంద్రం అద్దె రూ.750, పట్టణ ప్రాంతంలో వెయ్యి రూపాయల వరకు చెల్లిస్తున్నారు. టాయిలెట్స్​ లేక శుభ్రత ఉండటం లేదు. ఈగలు, దోమల వ్యాప్తి ఎక్కువగా ఉంటున్నది. 

- కోడం పవన్ కుమార్, సీనియర్​ జర్నలిస్ట్​