నీళ్ల లెక్క చెప్పాల్సి వస్తదనే మీటింగ్​కు ఏపీ డుమ్మా!

నీళ్ల లెక్క చెప్పాల్సి వస్తదనే మీటింగ్​కు ఏపీ డుమ్మా!

హైదరాబాద్, వెలుగుఏపీ సర్కారు మాట మార్చింది. త్రీమెన్​ కమిటీ మీటింగ్​కు ముందు వస్తామన్న ఏపీ.. ఆ తెల్లారే రాలేమంది. భారీ స్థాయిలో తరలించుకుపోయిన నీటి లెక్కలు చెప్పాల్సివస్తుందన్న భయంతోనే మీటింగ్​కు రాకుండా డుమ్మా కొడుతోంది. వాటర్​ రిలీజ్​ ఆర్డర్​తో పాటు ఇంకొన్ని విషయాలపై చర్చించేందుకు ఈ నెల 20న త్రీమెన్​ కమిటీ మీటింగ్​ పెట్టాలని కృష్ణా రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డు (కేఆర్​ఎంబీ) నిర్ణయించింది. ఏపీ, తెలంగాణ ఈఎన్సీలతో మాట్లాడిన తర్వాతే బోర్డు మెంబర్​ సెక్రటరీ హరికేశ్​ మీనా మీటింగ్​ను కన్ఫర్మ్​ చేశారు. ఈ సమాచారాన్ని అధికారికంగా తెలియజేస్తూ రెండు రాష్ట్రాలకూ లేఖ రాశారు. అయితే, మీటింగ్​కు వచ్చేందుకు ముందు ఏపీ ఈఎన్సీ ఒప్పుకున్నా.. ఆ తెల్లారే మాట మార్చేశారు. వరదలు భారీగా వస్తుండడంతో పరిస్థితిని సమీక్షించాల్సి ఉందని, సమావేశానికి రాలేనని చెబుతూ లేఖ రాశారు.

వాడుకున్నదెంతో చెప్పకుండనే

జూరాల నుంచి పులిచింతల వరకు ప్రాజెక్టుల నుంచి సముద్రంలోకి నీటిని వదులుతున్న రోజుల్లో (సర్​ప్లస్​ డేస్​) వాడుకున్న నీటిని లెక్కించొద్దని ఏపీ కోరుతోంది. దీనిపై సెంట్రల్​ వాటర్​ కమిషన్​ (సీడబ్ల్యూసీ) ఏర్పాటు చేసిన టెక్నికల్​ కమిటీ పరిశీలన చేస్తోంది. అయితే, కమిటీకి ఏపీ సరైన వివరాలేవీ ఇవ్వట్లేదు. అంతేకాదు.. డిసెంబర్​ వరకు ఇంకో 216 టీఎంసీల నీటిని కేటాయించాలని కోరుతూ కృష్ణాబోర్డుకు కొన్ని రోజుల కిందటే మరో ఇండెంట్​ కూడా పంపింది. ఆ ఇండెంట్​లోనూ అప్పటికే వాడుకున్న నీటి లెక్కలను చెప్పకుండానే సర్​ప్లస్​ డేస్​లో తీసుకున్న నీటిని మినహాయించాలని పేర్కొంది. ఈ ప్రతిపాదనను మన రాష్ట్రం తీవ్రంగా వ్యతిరేకించింది. దానిపై చర్చించేందుకు త్రీమెన్​ కమిటీ మీటింగ్​ పెట్టాలని బోర్డుకు లేఖ రాసింది. రెండు రాష్ట్రాలతో మాట్లాడిన బోర్డు.. మీటింగ్​ డేట్​ ఫిక్స్​ చేసింది.

ఫ్లడ్​, యుటిలైజేషన్​ డేటా ఇవ్వండి

ఏపీకి కృష్ణా బోర్డు తాజా లెటర్

జూరాల నుంచి నాగార్జునసాగర్​ వరకు అన్ని ప్రాజెక్టుల వరద, వాడుకున్న నీటి లెక్కలు ఇవ్వాల్సిందిగా ఏపీని కృష్ణా బోర్డు ఆదేశించింది. గురువారం ఏపీ ఈఎన్సీకి బోర్డు మెంబర్​ సెక్రటరీ హరికేశ్​ మీనా లెటర్​ రాశారు. జూరాల నుంచి నాగార్జునసాగర్​ వరకు ప్రాజెక్టులు నిండి నీటిని సముద్రంలోకి వదులుతున్న రోజుల్లో ఏపీ, తెలంగాణ ఉపయోగించుకున్న నీటి లెక్కలు తేల్చేందుకు ఏర్పాటు చేసిన టెక్నికల్​ కమిటీ సమావేశం కోసం వివరాలు ఇవ్వాలని కోరారు. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్​ రిజర్వాయర్లకు గత 20 ఏళ్లలో వచ్చిన వరద వివరాలను నెల, సంవత్సరాల వారీగా ఇవ్వాలని సూచించారు. రెండు రాష్ట్రాల మధ్య తాత్కాలికంగా చేసుకున్న నీటి వాటాల ప్రకారం ఏ రాష్ట్రం ఎంత నీటిని ఉపయోగించుకుందో ఆ వివరాలు ఇవ్వాలన్నారు. ఈ ఏడాది మే 13న నిర్వహించిన టెక్నికల్​ కమిటీ తొలి సమావేశంలో పాల్గొన్న ఏపీ ఇంటర్​ స్టేట్​ సీఈ ఆ వివరాలు ఇచ్చేందుకు ఒప్పుకున్నారని గుర్తు చేశారు. వీలైనంత త్వరగా వివరాలు ఇస్తే టెక్నికల్​ కమిటీ మరోసారి సమావేశమై సర్​ప్లస్​ నీటి వాటాలను తేల్చుతుందని చెప్పారు.

145 టీఎంసీలు తీసుకుంది

17 టీఎంసీల నీటిని మాత్రమే తీసుకునేందుకు ఏపీకి కృష్ణా బోర్డు రిలీజ్​ ఆర్డర్​ ఇచ్చింది. కానీ, బుధవారం వరకు వివిధ ఔట్​లెట్ల నుంచి దాదాపు 145 టీఎంసీలను తరలించుకుపోయింది. పోతిరెడ్డిపాడు హెడ్​ రెగ్యులేటర్​ నుంచి 86.70 టీఎంసీలు, కృష్ణా డెల్టా సిస్టంకు 35, నాగార్జునసాగర్​ కుడి కాలువకు 15, ముచ్చుమర్రి ద్వారా 7.60 టీఎంసీల నీటిని తరలించుకుంది. ఇందులో 120 టీఎంసీల వరకు ప్రాజెక్టులు సర్​ప్లస్​ అయ్యే రోజుల్లోనే ఏపీ తరలించుకుపోయినట్టుగా తెలంగాణ ఇంజనీర్లు చెప్తున్నారు. మొదటి రిలీజ్​ ఆర్డర్​ తర్వాత 71 టీఎంసీలు ఇవ్వాలని ఒకసారి, 216 టీఎంసీలు కావాలని ఇంకోసారి ఏపీ ఇండెంట్లు పంపింది. మొత్తంగా డిసెంబర్​ వరకు 304 టీఎంసీలు ఇవ్వాలంది. అయితే, వరద ఎక్కువగానే వస్తున్నా మన రాష్ట్రం ఇప్పటిదాకా వాడుకుంది కేవలం 30.5 టీఎంసీలే. నాగార్జునసాగర్​ ఎడమ కాలువ నుంచి 13 టీఎంసీలు, ఏఎమ్మార్పీ నుంచి 7.7, కల్వకుర్తి నుంచి 5, హైదరాబాద్​ తాగునీటికి 4.8 టీఎంసీలు తీసుకుంది. కరోనా కారణంగా కల్వకుర్తి పంపులను బంద్​పెట్టింది. ఆ మోటార్లను నడిపి ఉంటే మరో 10 టీఎంసీలకుపైగానే తీసుకునే అవకాశం ఉండేది. సర్​ప్లస్​ డేస్​లో ఏపీ వాడుకున్న నీటితో పోలిస్తే.. మనం వాడుకుంది జస్ట్​ ఆరో వంతే.