
- కొలీజియంకు వ్యతిరేకంగా కామెంట్లు చేయొద్దు
- జడ్జిల నియామకానికి చట్ట ప్రకారమే ఏర్పాటైందన్న సుప్రీంకోర్టు
- కొలీజియం వ్యవస్థను తప్పనిసరిగా అనుసరించాలి
- వ్యతిరేక కామెంట్లపై ప్రభుత్వాని కి సలహా ఇవ్వాలని సూచన
న్యూఢిల్లీ: చట్టాన్ని అమలు చేయడమే తమ పని అని, ఉన్నత న్యాయవ్యవస్థలో జడ్జిల నియామకం కోసం కొలీజియం సిఫార్సు చేసిన అనేక మంది పేర్లను కేంద్రం చాలాకాలంగా పెండింగ్‌లో ఉంచడం ఇబ్బందిగా మారిందని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. జడ్జీల నియామక ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగడం, పేర్లను క్లియర్ చేయడంలో ఆలస్యం కారణంగా, చాలామంది జడ్జిలు ఎలివేట్ అయ్యేందుకు సమ్మతిని వెనక్కి తీసుకుంటున్నారని పేర్కొంది. చట్టం ద్వారా జడ్జీల నియామకానికి సంబంధించిన కొలీజియం వ్యవస్థ ఏర్పడిందని, దానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పింది. అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఏ చట్టమైనా రూపొందుతుందని, కొలీజియం సిస్టమ్ అందులో భాగమే అని తెలిపింది. సుప్రీంకోర్టు ప్రకటించిన ఏ చట్టానికైనా అందరూ కట్టుబడి ఉండాలని, కొలీజియం వ్యవస్థను తప్పనిసరిగా అనుసరించాలని స్పష్టం చేసింది. జడ్జీల నియామకానికి సంబంధించి
కొలీజియం రికమెండ్ చేసిన పేర్లను కేంద్రం ఆమోదించకుండా ఆలస్యం చేయడంపై దాఖలైన పిటిషన్ను గురువారం సుప్రీంకోర్టు విచారించింది.
వివాదం ఎప్పటికి పరిష్కారం అవుతది
ఇటీవల కొలీజియం వ్యవస్థకు సంబంధించి సుప్రీంకోర్టు, కేంద్రం మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. జడ్జీల నియామకంపై పలు వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు కొలీజియం వ్యవస్థకు వ్యతిరేకంగా కామెంట్లు చేశారు. వీటిపై స్పందించిన సుప్రీంకోర్టు.. కొలీజియం వ్యవస్థను ఉద్దేశించి ప్రభుత్వంలోని కొందరు పెద్దలు చేస్తున్న కామెంట్లను సరికాదని అభిప్రాయపడింది. ఈ అంశంలో ప్రభుత్వానికి సలహా ఇవ్వాలని అటార్నీ జనరల్(ఏజీ) ఆర్.వెంకటరమణికి సూచించింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన చట్టపరమైన సూత్రాలను అనుసరిస్తారని ఆశిస్తున్నామని పేర్కొంది. కొలీజియం రికమెండ్ చేసిన 19 పేర్లను ఇటీవల కేంద్రం తిప్పిపంపడాన్ని నోట్ చేసుకున్న బెంచ్.. ఈ వివాదం ఎప్పటికి పరిష్కారమవుతుందని ఏజీని ప్రశ్నించింది.
అది సంక్షోభానికి దారి తీస్తది
కొలీజియం వ్యవస్థ ఉన్నంత వరకు, అది తీసుకున్న నిర్ణయాలు అమలు చేయాల్సిందేనని, మీరు వేరే చట్టం తీసుకురావాలని అనుకుంటే.. ఎవరూ అడ్డుకోరని స్పష్టం చేసింది. ‘‘చివరగా మేం ఇది చెప్పాలనుకుంటున్నాం. చట్టానికి తుది మధ్యవర్తిగా కోర్టులు ఉండాలని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. చట్టాన్ని రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంది. కానీ, ఆ చట్టం కోర్టుల పరిశీలనకు లోబడి ఉంటుంది”అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.