పైసలిస్తం ఆరోగ్యశ్రీ బంద్ పెట్టొద్దు: ఈటల

పైసలిస్తం ఆరోగ్యశ్రీ బంద్ పెట్టొద్దు: ఈటల
  • ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు మంత్రి ఈటల హామీ
  • సేవల నిలిపివేతనువిరమించుకున్న ఎన్ హెచ్ఏ
  • ఆగస్టు తొలి వారం వరకు ఆగాలని నిర్ణయం

హైదరాబాద్‌, వెలుగు: ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లిస్తామని, సేవల నిలిపివేత యోచనను విరమించుకోవాలని నెట్​వర్క్​ హాస్పిటల్స్​ అసోసియేషన్(ఎన్‌హెచ్‌ఏ)​కు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. సర్కారు హామీని సేవల నిలిపివేతను ఎన్‌హెచ్‌ఏ​ తాత్కాలికంగా వాయిదా వేసింది. ఎన్‌హెచ్‌ఏ ప్రతినిధులను రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌‌ సోమవారం చర్చలకు పిలిచారు. సచివాయంలోని తన చాంబర్‌‌లో ఎన్‌హెచ్‌ఏ ప్రతినిధులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆస్పత్రుల యజమానులతో సమావేశమయ్యారు. బకాయిలు చెల్లిస్తామని, సేవల నిలిపివేత యోచనను విరమించుకోవాలని ఈటల వారికి నచ్చజెప్పారు. ఆయన హామీతో సేవలరు కొనసాగించేందుకు అంగీకరించామని ఎన్‌హెచ్‌ఏ ప్రెసిడెంట్‌, డాక్టర్‌‌ వి రాకేశ్‌ వెల్లడించారు. ఆగస్టు తొలి వారం వరకూ వేచి చూస్తామని, అప్పటికీ బకాయిలు విడుదల కాకపోతే ఎగ్జిక్యూటీవ్‌ కమిటీ మీటింగ్‌లో చర్చించి సేవల నిలిపివేతపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నాలుగేండ్లుగా ఆరోగ్యశ్రీ నిధుల విడుదలలో తీవ్రం జాప్యం జరుగుతోందని, దీంతో తాము ఇబ్బందులు పడుతున్నామని డాక్టర్లు మంత్రికి వివరించారు. ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌, జేహెచ్‌ఎస్‌ కలిపి రూ.1,200 కోట్ల వరకూ బకాయిలు ఉన్నాయని, దీంతో దవాఖాన్లను నడపడం భారమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల విడుదలపై ఆరోగ్యశ్రీ సీఈవో, ఆరోగ్యశాఖ సెక్రటరీ ఇచ్చిన హామీలు నెరవేరలేదని మంత్రికి ఇచ్చిన వినతిపత్రంలో డాక్టర్లు పేర్కొన్నారు. డిసెంబర్‌‌ నుంచి రూ.200 కోట్లే మాత్రమే విడుదలయ్యాయని, మొత్తం బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఇకపై నిధులను సాఫీగా విడుదల చేయాలని వారు మంత్రిని కోరారు.