పాత విధానంలో ప్రదర్శనల వల్లే ప్రేక్షకులు దూరం.. మాయా వినోదం వేడుకలో వక్తలు

పాత విధానంలో ప్రదర్శనల వల్లే  ప్రేక్షకులు దూరం.. మాయా వినోదం వేడుకలో వక్తలు
  • మ్యాజిక్,  మిమిక్రీ , మైమ్ ప్రదర్శనలు 

ట్యాంక్ బండ్, వెలుగు : కిన్నెర ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో రవీంద్ర భారతి ప్రధాన వేదికపై మాయా వినోదం పేరిట మ్యాజిక్,  మిమిక్రీ , మైమ్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సామల వేణు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్​డాక్టర్ నరసింహా రెడ్డి, ఏపీ నాటక అకాడమీ అధ్యక్షుడు గుమ్మడి గోపాలకృష్ణ, మిమిక్రీ శ్రీనివాస్ హాజరయ్యారు. 

వారు మాట్లాడుతూ మనుషుల మనసులను రంజింపచేసేవి కళలు మాత్రమేనని అన్నారు. మైమ్ కు భాష అవసరం లేదని, మిమిక్రీ, మ్యాజిక్ ప్రేక్షకులను ఆనందాన్ని కలిగిస్తాయన్నారు. విదేశాల్లో రంగస్థల కళలకు ఆదరణ ఉందని, తెలుగు నాటకాలకు ప్రేక్షకులు ఆసక్తి చూపాలని కోరారు. 

కళాకారులు పాత విధానంలోనే  ప్రదర్శనలు ప్రదర్శించడం వల్ల  ప్రేక్షకులు దూరం అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.  మైమ్ మధు తదితరులు పాల్గొనగా కిన్నెర రఘురాం స్వాగతం పలికారు. చొక్కాపు రమణ,  మల్లం రమేశ్, జివిఎన్ రాజు సమన్వయంలో ఇరవై మంది కళాకారులు మ్యాజిక్, మిమిక్రి, మైమ్ ప్రదర్శనలు ఇచ్చారు.