బస్వాపూర్ రిజర్వాయర్​ కట్టకు కోత

బస్వాపూర్ రిజర్వాయర్​ కట్టకు కోత

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలో నిర్మిస్తున్న నృసింహ(బస్వాపురం) రిజర్వాయర్​ నిర్మాణ పనులు నాసిరకంగా సాగుతున్నాయి. చిన్న వానకే రిజర్వాయర్​ కట్ట కోతకు గురవుతోంది. ఈ కోతలు బయటకు కన్పించకుండా ఉండేందుకు కాంట్రాక్టర్లు హడావుడిగా మట్టి నింపేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా యాదాద్రి జిల్లాలోని బస్వాపూర్​లో రిజర్వాయర్(16వ ప్యాకేజీ)  నిర్మించాలని సర్కారు తలపెట్టింది. 11.39 టీఎంసీల కెపాసిటీతో నిర్మిస్తున్న ఈ రిజర్వాయర్ ద్వారా జిల్లాలోని ఆలేరు, ఆత్మకూర్​(ఎం), భువనగిరి, తుర్కపల్లి, బీబీనగర్, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, వలిగొండ, రామన్నపేట​మండలాల్లో 1,88,500 ఎకరాల ఆయకట్టుకు నీరందించాల్సి ఉంది. రెండేళ్లలో రిజర్వాయర్​ను పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ నాలుగేండ్లుగా పనులు సాగుతూనే ఉన్నాయి. శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రమైన భువనగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఈపాటి వర్షానికే రిజర్వాయర్​వెలుపలి వైపు కట్ట కోతకు గురైంది. శనివారం ఉదయం అటుగా వెళ్లిన బస్వాపురం గ్రామానికి చెందిన కొందరు కట్ట కోతకు గురవడం గమనించి ఫొటోలు తీశారు. విషయం తెలిసి  రిజర్వాయర్​ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ కోతకు గురైన చోట హడావుడిగా మట్టిని నింపే పనులు చేపట్టారు.