తెలంగాణపై ప్రేమ తగ్గదు.. ఎన్నికల వేళ కూడికలు, తీసివేతలు కామన్: కేటీఆర్

తెలంగాణపై ప్రేమ తగ్గదు..  ఎన్నికల వేళ కూడికలు, తీసివేతలు కామన్: కేటీఆర్

= ఉద్యమ స్ఫూర్తితోనే పదేండ్ల బీఆర్ఎస్ పాలన
= బిడ్డ పుట్టిన తర్వాత తల్లికి అనారోగ్యం చేస్తే మరో కుటుంబ సభ్యుడికి అప్పగిస్తుంది
= అట్లానే తెలంగాణలో వేరే పార్టీ అధికారంలో ఉంది
= త్వరలోనే ఆ బిడ్డ మా చేతికొస్తుంది: కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణపై తమకున్న ప్రేమ ఎప్పటికీ తగ్గదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్నికల సమయంలో  కూడికలు, తీసివేతలు కామన్ అని చెప్పారు. తమ పదేండ్ల పాలన ఉద్యమ స్ఫూర్తితోనే కొనసాగిందని అన్నారు. అమెరికాలోని డల్లాస్ లో  ఫ్రిస్కోలోని డా. పెప్పర్ ఎరీనాలో బీఆర్ఎస్ రజతోత్సవం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. 

ఈ సందర్భంగా కేటీఆర్ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరియసీ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు.  తెలంగాణా మట్టివాసనను అమెరికాకు మోసుకొచ్చిన ప్రవాసులు తమ శ్రమను, సమయాన్ని అభివృద్ధికి వినియోగించడం ఆనందించాల్సిన విషయమన్నారు. తెలంగాణా రత్నాలుగా, భరతమాత ముద్దుబిడ్డలుగా, తెలుగుతేజాలుగా అమెరికాలో అందరూ రాణించాలని ఆకాంక్షించారు. 

తెలంగాణ నినాదాన్ని సగర్వంగా చాటిచెప్పాలని సూచించారు. గత ఎన్నికలను ప్రస్తావిస్తూ బిడ్డ పుట్టినాక తల్లికి అనారోగ్యం వస్తే బిడ్డను మరో కుటుంబ సభ్యునికి అప్పగిస్తారని, అలానే ప్రస్తుతం తెలంగాణ లో వేరే పార్టీ అధికారంలో ఉన్నదని అన్నారు.  త్వరలోనే ఆ బిడ్డ తమ చేతికి వస్తుందని చెప్పారు. గాలివాటంగా వచ్చిన రాష్ట్రం తెలంగాణ కాదని, ఎందరో అమరవీరుల పోరాటంతో కేసీఆర్ 14ఏళ్ల మొక్కవోని పట్టుదలతో సాధించుకున్నదని అన్నారు. బోధించు-సమీకరించు-పోరాడు అన్న అంబేడ్కర్ నినాదమే కేసీఆర్ ఊపిరి అని చెప్పారు