మూసీ నది బ్యూటి ఫికేషన్​ జరగట్లే.. మొదలుపెట్టిన కొన్నాళ్లకే ఆగిన పనులు

మూసీ నది బ్యూటి ఫికేషన్​ జరగట్లే.. మొదలుపెట్టిన కొన్నాళ్లకే ఆగిన పనులు

హైదరాబాద్, వెలుగు: మూసీ బ్యూటిఫికేషన్ పనులు జరగట్లేదు. ఆక్రమణలను తొలగించి, కాలుష్య కోరల్లో చిక్కుకున్న నదిని ప్రక్షాళన చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆ మేరకు ఎక్కడా పనులు జరగలేదు. వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో పుట్టి కృష్ణా నదిలో కలిసే మూసీ నది గ్రేటర్​పరిధిలో 33 కిలో మీటర్ల మేర ప్రవహిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన రెండేళ్లలోనే మూసీని పరిరక్షిస్తామని సీఎం కేసీఆర్​అసెంబ్లీ సాక్షిగా చెప్పి, ‘మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెం ట్ కార్పొరేషన్ బోర్డు’ను చేశారు.

ఆ తర్వాత బ్యూటిఫికేషన్​పేరుతో యాక్షన్ ప్లాన్ రూపొందించి పనులు ప్రారంభించారు. అయితే ప్లాన్ రెడీ చేసి ఐదేండ్లు గడుస్తున్నప్పటికీ ఒక్క నాగోలు వద్ద మినహా ఎక్కడా పనులు జరగలేదు. అలాగే నదుల పరిరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ రివర్​వాటర్ కన్జర్వేషన్ స్కీం కింద మూసీని ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. ఇందులో పరివాహక ప్రాంతాల అభివృద్ధి, కాలుష్య కారకాల నియంత్రణ, మురుగు నీరు కలవకుండా ఇంటర్వేషన్ అండ్ డైవర్షన్ నిర్మాణాలు, ల్యాండ్ స్కేప్, పార్కులను అభివృద్ధి చేసేలా నిధులు కేటాయించింది.

అప్పటి ప్రతిపాదనలకు అనుగుణంగా రూ.400 కోట్లను విడుదల చేసింది. అధికారులు ఆ నిధులతో కనీసం మూసీ పరివాహక ప్రాంతాల్లో మురుగు కంపు లేకుండా చేయలేకపోయారు. ఇప్పటికీ అనేక చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఎక్కడా కనిపించడంలేదు. మూసీ ప్రక్షాళనకు రూ.4 వేల కోట్లతో ప్రతిపాదనలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు.

ఆగని మురుగు

బ్యూటిఫికేషన్​పనులతోపాటు సిటీలోని వేర్వేరు చోట్ల మూసీపై బ్రిడ్జిలు నిర్మించి బోటింగ్ సాదుపాయం కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వ కొన్నేండ్ల కింద ప్రకటించింది. వీటికి సంబంధించిన ఒక్క పని స్టార్ట్​కాలేదు. నదిలోకి వచ్చే వాటర్ ఛానళ్లు ఆక్రమణకు గురయ్యాయి. కొందరు ఇష్టానుసారంగా ఇండస్ట్రియల్, మానవ వ్యర్థాలను నదిలో కలిపేస్తున్నారు. డైలీ సిటీలో ఉత్పత్తి అయ్యే 1,300 ఎంఎల్ డీల మురుగునీటిలో 600 ఎంఎల్​డీల నీటిని శుద్ధి చేసి మూసీలోకి వదులుతున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ అంతకు మించిన మురుగునీరు, ఇండస్ట్రియల్​వ్యర్థాలు కలుస్తున్నాయని పర్యావరణవేత్తలు అంటున్నారు.  మురుగుతో పరివాహక ప్రాంతంలోని భూగర్భ జలాలు విషపూరితం అవుతున్నాయని హెచ్చరిస్తున్నారు. నది వెంబటి సీవరేజ్​ట్రీట్​మెంట్​ప్లాంట్లు ఏర్పాటు చేసి మురుగునీటిని శుద్ధి చేయాలంటూ ప్రణాళికలు రూపొందించినా, ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. 

పూర్వవైభవం సాధ్యమేనా?

మూసీకి ఒకప్పటి కళ వచ్చేలా కనిపించడం లేదు. రసాయనాల డంపింగ్ ఎక్కువగా ఉంటుండంతో మురుగు నీటిని శుద్ధి చేయడం సాధ్యమవుతుందా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. టెక్నాలజీతో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేసే అంశంపై దృష్టి పెట్టాలని మేధావులు, నిపుణులు ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వానికి పట్టడం లేదు. మూసీ ప్రక్షాళన, బ్యూటిఫికేషన్ పై హైకోర్టు పలు మార్లు హెచ్చరించిన ఎలాంటి మార్పు కనిపించడంలేదు. 

అత్యవసరమైన వాటినీ కట్టట్లే

మూసీనదిపై కొత్త బ్రిడ్జిల నిర్మాణం ప్రకటనలకే పరిమితమైంది. పరిపాలన అనుమతులు వచ్చిన ఏడాది దాటినా నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. మొత్తం 15 బ్రిడ్జిలు నిర్మిస్తామని ప్రకటించారు. ఇందులో అత్యవసరమైన మూసారాంబాగ్, చాదర్ ఘాట్ బ్రిడ్జిలను ముందు కడతామని, 10 రోజుల్లో పనులు ప్రారంభిస్తామని 7 నెలల కిందట మంత్రులు తలసాని, మహమూద్ అలీ ప్రకటించారు.

నేటికీ బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్ లు సిద్ధం కాలేదు. రూ.94 కోట్లతో ఈ రెండు బ్రిడ్జిలను నిర్మించనున్నట్లు చెప్పినప్పటికీ పనులు మొదలు పెట్టలేదు. వరదలు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల గేట్లు ఎత్తిన టైంలో హడావిడి చేస్తున్న మంత్రులు తర్వాత గాలికి వదిలేస్తున్నారు.

మంత్రి కేటీఆర్ ఎన్నోసార్లు హామీలు

గుజరాత్ లోని సబర్మతి నది తరహాలో మూసీని డెవలప్ చేస్తామని గతంలో మంత్రి కేటీఆర్ పలుమార్లు ప్రకటించారు. 2016 లో జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో మూసీ అభివృద్ధి హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత 2017 జులైలో అప్పటి మేయర్, అధికార గణంతో కలిసి సబర్మతి ప్రాంతంలో పర్యటించారు. అదే ఏడాది ఆగస్టులోనే మూసీ ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయని మంత్రి కేటీఆర్  ప్రకటించారు.

కానీ నేటికీ పనులు చేయలేదు. 2020లో జరిగిన ఎన్నికల్లోనూ మూసీ బ్యూటిఫికేషన్, పరిరక్షణపై ఎన్నో హామీలు ఇచ్చారు. 10 రోజుల కింద మరోసారి కేటీఆర్ మూసీ మాటెత్తారు. మూసీపై ఎక్స్​ప్రెస్​వేలు రాబోతున్నట్లు చెప్పారు. ఇరు వైపులా ఎక్స్ ప్రెస్​ వే వేయాలని ప్లాన్ ఉన్నప్పటికీ నిధులు లేక ముందుకు సాగడం లేదని తెలుస్తోంది.  

కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకే..

మూసీ బ్యూటిఫికేషన్​నిర్ణయమే సరైనది కాదు. వాస్తవానికి ప్రభుత్వం మూసీ పరిరక్షణ ప్రాజెక్టు తీసుకురావాలి. కేవలం కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు మాత్రమే బ్యూటిఫికేషన్​చేస్తున్నట్లు కనిపిస్తోంది. వికారాబాద్ నుంచి నల్గొండ జిల్లా వాడపల్లి వరకు ఉన్న మూసీని పరిరక్షించాలి. తెలంగాణ ఉద్యమం టైంలో కేసీఆర్​కూడా ఇదే చెప్పారు. కానీ ఇప్పుడు వేరేగా మాట్లాడుతున్నారు. నాగోలు నుంచి ఎక్స్ ప్రెస్ వే నిర్మిస్తామని మంత్రి కేటీఆర్ అంటున్నారు. మూసీ పక్కన ఇదివరకే రోడ్డు ఉంది. మళ్లీ కొత్తగా రోడ్డు అనేదేంటి. ఉన్నదాన్ని డెవలప్ చేస్తే సరిపోతుంది.  – దొంతి నర్సింహారెడ్డి, ఎక్స్ పర్ట్