ఉస్మానియా సాల్తలేదు.. పేషెంట్లకు నేలపైనే ట్రీట్ మెంట్

ఉస్మానియా సాల్తలేదు.. పేషెంట్లకు నేలపైనే ట్రీట్ మెంట్
  •     పేషెంట్లతో నిండిపోయిన హాస్పిటల్
  •     ఓల్డ్ బిల్డింగ్​ క్లోజ్​ అవడంతో తగ్గిన బెడ్లు
  •     నేలపై పడుకోబెట్టి ట్రీట్​మెంట్ చేస్తున్న డాక్టర్లు
  •     గాంధీ కేసులన్నీ ఉస్మానియాకే మళ్లింపు
  •     గాంధీలో నాన్​కొవిడ్ సేవలు స్టార్ట్​ చేయాలి: జూడాలు​

హైదరాబాద్, వెలుగు:ఉస్మానియా దవాఖాన రోగులతో కిటకిటలాడుతోంది. వార్డుల్లో సందు లేకుండా బెడ్లేసినా సరిపోక నేలపైనే ట్రీట్ మెంట్ చేయాల్సి వస్తోంది. థియేటర్లు సాలక డాక్టర్లు ఆపరేషన్లు పోస్ట్​పోన్ చేస్తుండటంతో పేషెంట్లు వారాలకు వారాలు ఆగాల్సి వస్తోంది.

375 బెడ్లు తగ్గినయ్​

గతంలో ఉస్మానియాలో 1,170 బెడ్లుండేవి. కానీ 375 బెడ్లున్న పాత బిల్డింగ్‌ క్లోజ్ చేశాక ఈ సంఖ్య ఏడొందలకు పడిపోయింది. ఆ బిల్డింగులోని వార్డులన్నింటినీ కొత్త బిల్డింగులో అడ్జస్ట్ చేశారు. హాళ్లలో సందులేకుండా బెడ్లేసినా సరిపోవడం లేదు. సర్కారు హాస్పిటళ్లలో గాంధీ, ఉస్మానియా తప్ప మరెక్కడా సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో లేవు. గాంధీలో కరోనా పేషెంట్లనే చేర్చుకుంటుండటంతో మిగతా రోగులంతా ఉస్మానియాకు పోతున్నారు. అక్కడ పేషెంట్లు పెరిగి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోగులు, అటెండెంట్లతో హాస్పిటలంతా కిక్కిరిసిపోతోంది. ఒక్కరికి కరోనా సోకినా అందరికీ అంటుకుంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

గాంధీలో నాన్​ కొవిడ్​ స్టార్ట్​ కాలె 

గాంధీ హాస్పిటల్‌‌‌‌లో నాన్‌‌‌‌ కొవిడ్ సేవలు ప్రారంభించాలని ఆరు రోజులుగా అక్కడి జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. ప్రస్తుతం గాంధీలో 250 మంది కరోనా పేషెంట్లే ఉన్నారని, వాళ్లకు వందల మంది డాక్టర్లు ఎందుకని జూడాలు ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 21లోపు నాన్ కొవిడ్‌‌‌‌ సేవలు స్టార్ట్​ చేయాలని ఇటీవల డీఎంఈ ఉత్తర్వులిచ్చారు. కరోనా వార్డులను నాన్‌‌‌‌ కొవిడ్ వార్డులుగా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం సాయంత్రం డీఎంఈ గాంధీకి వచ్చి ఏర్పాట్లను పరిశీలించారు. అన్ని డిపార్ట్‌‌‌‌మెంట్లను ప్రారంభించినున్నట్టు వెల్లడించారు. మెడిసిన్‌‌‌‌, పల్మనాలజీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్‌‌‌‌, ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్‌‌‌‌మెంట్లను ప్రారంభించట్లేదని, ఈ విషయాన్ని హాస్పిటల్ సూపరింటెండెంట్ తమతో చెప్పారని జూడాలు చెబుతున్నారు. వాటినీ స్టార్ట్‌‌‌‌ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకదాని తర్వాత ఒకటి ప్రారంభిస్తామని డీఎంఈ తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా సమ్మె

గాంధీలో జూడాలు చేస్తున్న సమ్మెకు మద్దతుగా విధులు బహిష్కరించేందుకు డాక్టర్లు సిద్ధమవుతున్నారు. ఉస్మానియా, ఆదిలాబాద్ రిమ్స్‌‌‌‌, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీల  జూనియర్ డాక్టర్లు సోమవారం సమ్మె నోటీసు ఇచ్చారు. గాంధీలో రెండ్రోజుల్లో  నాన్‌‌‌‌ కొవిడ్ స్టార్ట్​ చేయాలని, లేకుంటే అన్ని టీచింగ్ హాస్పిటళ్లలో సమ్మె చేస్తామని హెచ్చరించారు.