అడ్వెంచర్ డ్రామాగా‘అరణ్య‘

అడ్వెంచర్ డ్రామాగా‘అరణ్య‘

రానా విభిన్నమైన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘అరణ్య’. ఈ ఏడాదిలో అతిపెద్ద అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ మూడు భాషల్లో నిర్మిస్తోంది. తెలుగులో  ‘అరణ్య’,  తమిళంలో ‘కాడన్’ హిందీలో  ‘హాథీ మేరీ సాథీ’గా విడుదల కానుంది. అస్సాంలోని కజిరంగా ప్రాంతంలో ఉన్న ఏనుగుల ఆవాసాన్ని మనుషులు  కబ్జా చేసిన ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు ప్రభు సాల్మన్ .  తన జీవితాన్ని  అడవికే అంకితం చేసి, అక్కడ నివసించే జంతువులను కాపాడాలనే  లక్ష్యంతో జీవించే బాణదేవ్ అనే అడవి మనిషి పాత్రలో రానా  కనిపించబోతున్నాడు.  ఇటీవల విడుదలైన అతని ఫస్ట్‌‌ లుక్‌‌కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమాలోనే కాదు, ఈ పాత్ర కోసం కూడా పెద్ద అడ్వెంచరే చేశాడు రానా.  చాలా కఠినమైన ఆహార నియమాల్ని పాటించడంతో పాటు,  జిమ్‌‌లో తీవ్ర కసరత్తులు చేసి ముప్ఫై కిలోల బరువు తగ్గాడు.  పెరిగిన గడ్డం, గ్రే హెయిర్, వంగిన భుజంతో కనిపిస్తాడు. అన్నిరోజుల పాటు ఈ మేకోవర్‌‌‌‌తో, భుజాన్ని అదే యాంగిల్‌‌లో ఉంచి నటించడం కూడా అంత ఈజీ కాదు. వీటన్నిటి కోసం తాను చేసిన కృషి గురించి రానా మాట్లాడుతూ ‘డైరెక్టర్ ప్రభు సాల్మన్ నా పాత్రకు సంబంధించి ప్రతిదీ వాస్తవికంగా, సహజంగా ఉండాలని భావించారు. ఎప్పుడూ భారీకాయంతో, దృఢంగా ఉండాలనుకొనే నాకు ఈ స్థాయిలో బరువు తగ్గడం అనేది చాలా కష్టమైన పని. అందుకే సన్నగా మారడానికి తీవ్రమైన ఫిజికల్ ట్రైనింగ్ తీసుకున్నా. ఇది నాకొక వండర్‌‌‌‌ఫుల్ లెర్నింగ్ ఎక్స్‌‌పీరియెన్స్’ అని చెప్పాడు.  ఈ మధ్య కాలంలో అక్కడక్కడ రానా కెమెరాకి చిక్కడంతో అతడి ఆరోగ్యం పట్ల చాలా వదంతులు వచ్చాయి. బహుశా వాటన్నిటికీ ఈ పాత్ర కోసం చేసిన మేకోవరే కారణమేమో అని ఇప్పుడనిపిస్తోంది. ఏదేమైనా పాత్ర కోసం రానా మారిన తీరు మాత్రం అదుర్స్.