ప్రతిపక్షాల ఒంటరి పోరుతో బీజేపీకే ఫాయిదా

ప్రతిపక్షాల ఒంటరి పోరుతో బీజేపీకే ఫాయిదా

వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్, గుజరాత్, హిమాచల్​ ప్రదేశ్​ ఎన్నికలు మోడీ ప్రభుత్వానికే కాదు, ప్రతిపక్షాలకు కూడా కీలకమే. తమలో ఐక్యత సాధించేందుకు, బీజేపీని కలసికట్టుగా ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే అవి ఒకదానితో మరొకటి చేతులు కలపకముందే.. హిందీ ప్రభావిత రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టేశాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్​లో ప్రతిపక్షాలు కలసికట్టుగా పోటీ చేయకపోవడం వల్ల ఓట్లు చీలిపోయి బీజేపీకే మేలు జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఉత్తరప్రదేశ్​ ఎన్నికల కోసం అన్ని పార్టీలు సొంత వ్యూహాల్లో మునిగిపోయాయి. చాలా పార్టీలు ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించాయి. ఒంటరిగానే పోటీ చేస్తామని చెబుతున్నాయి. 2017లో ఎస్పీ, కాంగ్రెస్ చేతులు కలిపినా బీజేపీ విజయ పరంపరలో కొట్టుకుపోయాయి. మొత్తం 403 సీట్లు ఉన్న యూపీ అసెంబ్లీలో ఎస్పీ 47 సీట్లు, కాంగ్రెస్ 7 సీట్లకు పరిమితమయ్యాయి. ఇప్పుడు కూడా ప్రతిపక్షాల మధ్య అవగాహన లేకపోవడం, ఐక్యత సాధించలేకపోవడంతో ఓట్లు చీలి బీజేపీ లాభపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ ఒంటరి పోరాటానికి సిద్ధమవుతుండగా.. అలాగే రాష్ట్రానికి సంబంధం లేని ప్రాంతీయ పార్టీలైన శివసేన, తృణమూల్​ కాంగ్రెస్, ఆప్, ఎంఐఎం ఈ ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకోనున్నాయి. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం ద్వారా బీజేపీకి ఫేస్​ టు ఫేస్​ ఫైట్​ ఇవ్వాల్సిన ఈ పార్టీలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా సొంతంగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఈ లౌకిక పార్టీల సమస్య ఏమిటంటే ఇవన్నీ అహంతో నిండిపోయి ఉన్నాయి. వరుసగా ఎన్నికల్లో విఫలమవుతున్నా.. బీజేపీని ఒంటరిగా ఓడించగలమని అవి ఇప్పటికీ భావిస్తున్నాయి. సొంతంగా పోటీ చేసి బీజేపీని ఓడించడం అసాధ్యమని తెలిసినప్పటికీ, నంబర్​ గేమ్​లో ఒకరినొకరు అధిగమించడానికి ఆసక్తి చూపుతున్నాయి.

హిందూత్వ కార్డు
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​కు వ్యతిరేకంగా ఎన్నో అంశాలు ప్రభావం చూపుతున్నాయి. కరోనాను ఎదుర్కోవడం, లా అండ్​ ఆర్డర్​ పరిస్థితి, లవ్​ జిహాద్, రైతుల ఆందోళనలు, డెంగీ జ్వరాలు ఇలా చాలా అంశాలు ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. అయినా కూడా హిందూత్వ కార్డు ఒక్కటే ఇప్పటికీ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోంది. ఎలక్షన్లు దగ్గరపడిన కొద్దీ నాయకులు యాత్రలు చేయడం, గుళ్లకు వెళ్లడం బీజేపీ హిందూత్వ ఎజెండాకు కౌంటర్​ సొల్యూషన్​ కాదు. హిందూ దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీని అనుకరించే ప్రయత్నం చేయకుండా, కొత్త తరహా వ్యూహాలతో ముందుకొస్తేనే ప్రతిపక్షాలు బీజేపీని నిలువరించగలుగుతాయి.

కలిసికట్టుగా ముందుకెళ్లాలి
2024 జనరల్​ ఎలక్షన్లలో బీజేపీని ఓడించాలంటే 543 లోక్​సభ సీట్లలోనూ ప్రతిపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థులను నిలపాలని ప్రశాంత్ కిశోర్​ లాంటి వారు ఇప్పటికే చెప్పారు. దీనిని ఉత్తరప్రదేశ్​ నుంచే మొదలు పెట్టాల్సి ఉంది. కానీ అన్ని ప్రాంతీయ పార్టీలు.. చివరికి యూపీలో అసలు ఉనికే లేని పార్టీలు కూడా ఒంటరిగా పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. ముఖ్యంగా  మమత, శరద్​పవార్​ బీజేపీని కాకుండా కాంగ్రెస్​ను ఇబ్బందులకు గురిచేయాలని ప్రయత్నిస్తున్నారు. వారు కాంగ్రెస్​ కంటే ఒక్క సీటు ఎక్కువ సాధించినా తమను తాము జాతీయ పార్టీగా నిరూపించుకోవచ్చనేది వారి తాపత్రయం. ఇక అసదుద్దీన్​ ఒవైసీ.. మొత్తం ముస్లింలంతా తనవైపే ఉన్నారని నిరూపించుకునేందుకు ఒంటరిగా పోటీ చేయాలని భావిస్తున్నారు. దీని వల్ల మైనార్టీ ఓట్లు చీలిపోతాయి. ఈ పార్టీలన్నింటికీ బీజేపీకంటే కాంగ్రెస్​ పార్టీనే మొదటి శత్రువు.

లోక్​సభ ఎన్నికల్లో సీట్ల కోసమే..
ప్రస్తుతం యూపీ అసెంబ్లీ ఎన్నికలు, బీజేపీని ఓడించే స్ట్రాటజీలపై దృష్టి పెట్టాల్సిన ప్రతిపక్షాలు తమలో తామే కొట్టుకుంటున్నాయి. వీరి లక్ష్యం బీజేపీని ఓడించడం మాత్రమే కాదు, తమకు ఎక్కువ ఓట్లు, సీట్లను సాధించుకోవడం కూడా. తద్వారా 2024 జనరల్​ ఎలక్షన్లలో ఎక్కువ సీట్లను కోరడానికి అవకాశం దక్కుతుందనేది ఈ పార్టీల ఆలోచన. అయితే ప్రతిపక్షాలు తమ అసలు టార్గెట్​పై ఫోకస్​ పెట్టకుండా సీట్ల సంఖ్యను ఎలా పెంచుకుంటాయనే విషయాన్ని ఆలోచించడం లేదు. క్యాస్ట్​ పాలిటిక్స్​కు అభివృద్ధి ఎజెండానే సరైన ప్రత్యామ్నాయం. దాని ద్వారా ప్రభుత్వ పనితీరులో మార్పు చూపించవచ్చు. అయితే ప్రస్తుతం యూపీలో ప్రతిపక్షాలు ఈ విషయంపై దృష్టి పెట్టడం లేదు. ప్రతి పార్టీ కూడా ఒక్కో మతం, ఒక్కో కులానికి ప్రాతినిథ్యం వహిస్తూ జనాల సెంటిమెంట్​తో ఆడుకుంటున్నాయి.

రాముడే బీజేపీ బలం
బీజేపీ రాముడి పేరుతో ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. కానీ ప్రతిపక్షాలు రాముడిపై ఆధారపడలేవు. అన్ని పార్టీలు ఆలయాలకు వెళ్లినా ఆ విషయం చెప్పుకునేందుకు ఆ పార్టీలు సిద్ధంగా లేవు. కాంగ్రెస్​ నుంచి రాహుల్, ప్రియాంక, ఆప్​ నుంచి మనీశ్​​ సిసోడియా, తృణమూల్​ నుంచి మమతా బెనర్టీ వీరంతా కూడా బీజేపీని అనుకరించడంలో బిజీగా ఉన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 జనరల్​ ఎలక్షన్లలో ప్రజల నాడిని నేరుగా వెల్లడిస్తాయి. ఇప్పటి వరకైతే, బీజేపీకే సానుకూల పవనాలు వీచే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మిగతా సెక్యులర్​ పార్టీలన్నీ ఒకరితో మరొకరు చేతులు కలిపేందుకు ముందుకు రాకపోవడం ద్వారా తమ గోతులను తామే తవ్వుకుంటున్నాయి. 

ఒంటరిగా ఓడించలేవు
బీజేపీని ఒంటి చేత్తో ఓడించే పరిస్థితుల్లో కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ లేవని చెప్పడానికి ప్రశాంత్​ కిశోర్​ లాంటి పొలిటికల్​ అడ్వైజర్ల అవసరం లేదు. బీజేపీని ఓడించాలనే ఏకై‌‌‌‌క లక్ష్యంతో తమ విభేదాలను పక్కన పెట్టి ఈ మూడు పార్టీలు పోరాడితే సానుకూల ఫలితాలను సాధించవచ్చు. లేకుంటే ఈ మూడు పార్టీలు ఒకరి ఓట్లను మరొకరు చీల్చుకోవాల్సి వస్తుంది. ఇక బెంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించిన మమతాబెనర్జీ కూడా పోటీ చేస్తే ఓట్లు మరింతగా చీలిపోతాయి. తృణమూల్​, ఆప్, ఎన్సీపీ, ఆర్జేడీ, ఇతర చిన్నాచితకా పార్టీలతో చేతులు కలిపే అవకాశం ఉంది. ఎంఐఎం కూడా ముస్లిం ప్రభావం ఉన్న వంద సీట్లలో పోటీ చేస్తామని చెబుతోంది. ఇవన్నీ కూడా బీజేపీని మంచి పొజిషన్​లో నిలుపుతున్నాయి. హిందువులు మెజారిటీగా ఉన్న ఉత్తరప్రదేశ్​లో ముస్లింల సంఖ్య 19%గా ఉంది.

- అనితా సలుజా, సీనియర్​ జర్నలిస్ట్, పొలిటికల్​ కామెంటేటర్

For More News..

మాస్క్‌‌ తీసేయండి.. లేకపోతే బయటికి పోండి

వరుసకు అన్న అయ్యే వ్యక్తితో లవ్ మ్యారెజ్..