కమలానికి చౌటుప్పల్, చండూరులో నిరాశ

కమలానికి చౌటుప్పల్, చండూరులో నిరాశ

నల్గొండ, వెలుగు:  చౌటుప్పల్​, చండూరు మండలాల్లో బీజేపీకి నిరాశ ఎదురైంది. ఈ మండలాల్లో తమకు భారీ మెజార్టీ వస్తుందని బీజేపీ ఆశించినప్పటికీ ఆ ఫలితం దక్కలేదు. బీజేపీ మొదటి నుంచీ అర్బన్ ఓటు బ్యాంక్ ను ప్రధానంగా నమ్ముకుంది. ముఖ్యంగా చౌ టుప్పల్, చండూరు మండలాల్లోని అర్బన్ ఓటర్లు తమకే ఓటేస్తారని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఆశించారు. ఈ రెండు మండలాల్లో మంచి మెజారిటీ సాధిస్తే టీఆర్ఎస్​ను ఓడించవచ్చని భావించారు.

 చౌటుప్పల్  మండలంలో వచ్చిన మెజార్టీ 714

మునుగోడు నియోజకవర్గంలో  2 లక్షల 40 వేల ఓట్లు ఉంటే, చౌటుప్పల్ మండలంలో 83 వేలకు పై గా ఉన్నాయి.  ఒక్క చౌటుప్పల్ మున్సిపాలిటీలోనే 23 వేల ఓట్లు ఉండగా, అందులో కేవలం 17 వేలు మాత్రమే పోలయ్యాయి. అంటే 73శాతం పోలింగ్​ నమోదైంది. నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో 93 శాతం ఓటింగ్ నమోదైతే.. చౌటుప్పల్ పట్టణంలో ఇంత తక్కువగా పోలింగ్ జరగడం బీజేపీపై ఎఫెక్ట్ చూపిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక చౌటుప్పల్ మండలంలోని ఓట్లను మొత్తంగా 4 రౌండ్లలో లెక్కించగా... టీఆర్ఎస్ కు 714 ఓట్ల ఆధి క్యం లభించింది. వాస్తవానికి చౌటుప్పల్ లో 5 వేల మెజార్టీ వస్తుందని రాజగోపాల్ రెడ్డి భావించారు. కానీ ఫలితం పూర్తిగా రివర్స్ అయ్యింది.

చండూరు మండలంలోనూ సేమ్​ సీన్​..

చండూరు మండలంపై కూడా రాజగోపాల్​రెడ్డి భారీ ఆశలు పెట్టుకున్నారు.  కానీ, ఆయన అంచనాలు ఇక్కడ కూడా తారుమారయ్యాయి. చండూరు మున్సిపాలిటీలో 24 వేల 995 ఓట్లు, రూరల్‌లో 31 వేల 333 ఓట్లున్నాయి. 8వ రౌండ్​లో 532 ఓట్లు, 9వ రౌండ్​లో 832 ఓట్లు, 10వ రౌండ్​లో 484 ఓట్ల మెజార్టీతో ఈ మండలంలో అధికార టీఆర్ఎస్ హవా కొనసాగించింది. దీంతో బీజేపీ పెట్టుకున్న ఆశలు చండూరు లోనూ అడియాశలయ్యాయి.  ఏడో రౌండ్​వరకు కొనసాగుతున్న టీఆర్ఎస్ ఆధిక్యాన్ని చండూరు ఓట్లతో దాటేయాలని  బీజేపీ భావించింది. నిజానికి చండూరుకు చెందిన కాంగ్రెస్ నేతలు రాజగోపాల్ రెడ్డి వెంట బీజేపీ వెంట నడిచారు.  మున్సిపాలిటీలో రాజగోపాల్ రెడ్డికి ఓటు బ్యాంక్ ఉంది. కానీ, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువ ఉంది. ఆ ఓట్లను టీఆర్ఎస్  క్యాష్ చేసుకుంది. సంస్థాన్ నారాయణ పూర్ మండలంలోనూ మెజార్టీ వస్తుందని బీజేపీ ఆశించినా..టీఆర్ఎస్ కే ఆధిక్యం వచ్చింది.  బీజేపీకి పట్టున్న ప్రాంతాలపై మొదటి నుంచీ టీఆర్ఎస్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అనుకున్నట్లుగా ప్రణాళికలను అమలుచేసి ఈ రెండు మండలాలను కైవసం చేసుకొని అంతిమంగా మునుగోడులో గులాబీ జెండా ఎగురవేసింది.