బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు భారీ ఏర్పాట్లు

 బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు భారీ ఏర్పాట్లు

హైదరాబాద్ : హైదరాబాద్ లో నిర్వహించే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. HICC నోవాటెల్ హోటల్ లో ఏర్పాట్లకు బీజేపీ నాయకులు భూమి పూజ చేశారు. పార్టీ జాతీయ నేతలు శివప్రకాశ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర పార్టీ చీఫ్ బండి సంజయ్, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హైదరాబాద్ బీజేపీ కార్యవర్గ సమావేశాలను, ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు  కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. జూలై 2,3 తేదీల్లో హైదరాబాద్ లో సమావేశాలు జరగనున్నాయి. HICCలో రెవెన్యూ, పోలీసులు, GHMC ఉన్నతాధికారులతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  సమీక్ష సమావేశం నిర్వహించారు. జూలై 2,3 తేదీల్లో జరగబోయే బీజేపీ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లపై రివ్యూ నిర్వహించారు. భద్రత, పార్కింగ్, ప్రతినిధులు బస చేసే భద్రత ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. సమీక్షలో హైదరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, RDO చంద్రకళ  పాల్గొన్నారు. 

మరోవైపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించబోయే మోడీ బహిరంగ సభపై రాష్ట్ర బీజేపీ ఫోకస్ చేసింది. మోడీ సభకు 10 లక్షల మందిని తరలించేలా ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ మొత్తాన్ని కాషాయమయంగా మార్చేందుకు హార్డింగ్స్, భారీ ఫ్లెక్సీలతో నింపేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. ఇప్పటి వరకు బీజేపీ సభ కోసం మొత్తం 16 ట్రైన్లను బుక్ చేసింది బీజేపీ. మౌలాలి, మల్కాజ్ గిరి రైల్వేస్టేషన్ల కు బుక్ చేసిన ట్రైన్లు వచ్చేలా ప్లాన్ చేసింది. ట్రైన్లు, బస్సులు, కార్లు, ఇతర వాహనాలను బుక్ చేస్తోంది. బూత్ స్థాయి నుంచి పబ్లిక్ ను తరలించేలా ప్లాన్ చేస్తున్నారు నేతలు. ఒక్కో నియోజకవర్గం నుంచి 10 వేల మందిని సభకు తరలించాలని నియోజకవర్గ కో ఆర్డినేటర్లకు పార్టీ ఆదేశాలు జారీ చేసింది. జూలై 3న జరిగే మోడీ సభపైనే బీజేపీ ఫోకస్ చేసింది. ప్రధాని మోడీ సభతో రాష్ట్రంలో సత్తా చాటుతామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. కేసీఆర్ సర్కార్ నియంత పాలనను ప్రజలు సాగనంపుతారని చెప్పారు. 8 ఏళ్లలో కేసీఆర్ కుటుంబమే బంగారమయంగా మారిందని ఆరోపించారు.