కర్నాటకలోని బార్డర్ ప్రాంతాలపై మహారాష్ట్ర అసెంబ్లీ తీర్మానం

కర్నాటకలోని బార్డర్ ప్రాంతాలపై మహారాష్ట్ర అసెంబ్లీ తీర్మానం

ముంబై: మహారాష్ట్ర, కర్నాటక మధ్య సరిహద్దుల లొల్లి మరింత ముదురుతోంది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉన్నా..  మొన్న కేంద్ర హోంమంత్రి మధ్యవర్తిత్వం వహించినా గొడవ చల్లారలేదు. ప్రతి అంగుళాన్ని దక్కించుకుంటమని మహారాష్ట్ర, ఒక్క అంగుళమూ వదులుకోబోమని కర్నాటక ప్రకటనలు చేస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాలపై వారం కిందట కర్నాటక అసెంబ్లీ తీర్మానం పాస్ చేస్తే.. తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ కూడా తీర్మానాన్ని పాస్ చేసింది. ఈ వివాదంపై మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే కీలక సూచన చేశారు. సుప్రీం తీర్పు వచ్చే దాకా వివాదాస్పద ఏరియాలను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలన్నారు.

ప్రతి అంగుళాన్ని దక్కించుకుంటం: షిండే

వివాదాస్పద ప్రాంతాలను మహారాష్ట్రలో చట్టబద్ధంగా చేర్చాలంటూ మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంపై సీఎం ఏక్‌‌నాథ్ షిండే మాట్లాడారు. బెల్గామ్(బెళగావి), కార్వార్, బీదర్, నిపాని, భాల్కీ ప్రాంతాలు, మరాఠీ మాట్లాడే 865 గ్రామాల్లోని ప్రతి అంగుళాన్ని మహారాష్ట్ర పరిధిలోకి తీసుకుని వస్తామని పేర్కొన్నారు. ఇందుకు సుప్రీంకోర్టులో కూడా మహారాష్ట్ర ప్రభుత్వం పోరాడుతుందని స్పష్టంచేశారు. కర్నాటక ప్రభుత్వ ‘యాంటీ మరాఠీ’ వైఖరిని ఖండించారు.

బార్డర్‌‌‌‌ ఏరియాల్లోని మరాఠా ప్రజలకు మహారాష్ట్ర అండగా ఉంటుందన్నారు. ఆయా ప్రాంతాలను తమ రాష్ట్రంలో కలుపుకునేందుకు చట్టపరంగా పోరాడుతామన్నారు. కేంద్ర హోంమంత్రితో జరిగిన భేటీలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలంటూ కర్నాటకపై కేంద్రం ఒత్తిడి తేవాలని,  మరాఠీ ప్రజల భద్రతకు హామీ ఇచ్చేలా చూడాలని కోరుతూ సరిహద్దు వివాద తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

వివాదాన్ని పెద్దది చేస్తున్న ఉద్ధవ్ వర్గం

బెళగావిలో మరాఠీ మాట్లాడే వాళ్లు ఎక్కువగా ఉన్నారు. గతంలో బాంబే ప్రెసిడెన్సీలో భాగంగా ఈ ప్రాంతం ఉండేది. దీనితోపాటు కార్వార్, నిప్పాని ప్రాంతాలను మహారాష్ట్రలో కలపాలని డిమాండ్ చేస్తుండగా.. కర్నాటక ఖండిస్తోంది. ప్రస్తుతం ఈ వివాదం సుప్రీంకోర్టులో ఉంది. మరోవైపు, సౌత్ షోలాపూర్, అక్కల్‌‌కోటే రీజియన్లు తమవేనని, అక్కడ కన్నడ మాట్లాడే వాళ్లు ఎక్కువగా ఉన్నారని కర్నాటక వాదిస్తోంది. దీనిపై ఇటీవల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.

రెండు రాష్ట్రాల్లోనూ బస్సులపై దాడులు జరిగాయి. కర్నాటకలోని బెళగావిలో, మహారాష్ట్రలోని పుణెలో ‘పేరు’ కనబడకుండా బస్సులకు పెయింట్ వేశారు. ‘‘ఇండియాలోకి చైనా చొరబడినట్లే.. మేం కర్నాటకలోకి వెళ్తాం” అని వారం కిందట సంజయ్ రౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాతి రోజే కర్నాటక సర్కారు తీర్మానం పాస్ చేసింది. దీంతో సరిహద్దు ప్రాంతాల విషయంలో షిండే ప్రభుత్వం.. కర్నాటకపై బలమైన వైఖరి తీసుకోలేదని ఉద్ధవ్ వర్గం ఆరోపణలు చేసింది.

యూటీగా మార్చండి: ఉద్ధవ్ 

మరాఠాలను కర్నాటక అణచివేస్తున్నదని ఉద్ధవ్ థాక్రే అన్నారు. శాసన మండలిలో ఉద్ధవ్ మాట్లాడారు. కర్నాటకలోని మరాఠీ మాట్లాడే ఏరియాలన్నింటినీ కలిపి కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయాలని సూచించారు. సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే దాకా.. బెళగావి, కార్వార్, నిప్పాని తదితర ఏరియాలను కలిపి కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలి. ఈ వివాదంపై కర్నాటక సీఎం దూకుడుగా వ్యవహరిస్తుండగా, మహారాష్ట్ర సీఎం షిండే మౌనంగా ఉన్నారని విమర్శించారు.