పుస్తకాలు ఎంతోమందిని మేధావులుగా మార్చాయి. వాటితోనే ఖైదీల మనుసుని మార్చి మంచి మనుషులుగా తీర్చిదిద్దాలి అనుకుంది బ్రెజిల్ గవర్నమెంట్. అందుకే పుస్తకాలు చదివి, వాటి రివ్యూ రాసిన వాళ్లకు శిక్షను తగ్గిస్తోంది. ఖైదీలు ఒక పుస్తకానికి నాలుగు రోజులు, ఏడాదిలో గరిష్టంగా 48 రోజుల శిక్షను తగ్గించుకోవచ్చు.
బ్రెజిల్ జస్టిస్ మినిస్ట్రీ 2012లో ఈ ప్రోగ్రామ్‌ని అమలులోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం జైలు అధికారులు ఆమోదించిన పుస్తకాల్లో దేనినైనా ఖైదీలు ఎంచుకోవచ్చు. అందులో లిటరేచర్, ఫిలాసఫీ, సైన్స్, క్లాసిక్స్ ఉంటాయి. ఒక పుస్తకాన్ని 30 రోజుల్లో చదివి, దానికి 4 పేజీల రివ్యూ రాయాలి. జైలు అధికారులు లేదా బుక్ క్లబ్ మెంబర్లు ఆ రివ్యూను అప్రూవ్ చేస్తే శిక్ష నుంచి 4 రోజులు తగ్గుతాయి. అలా ఏడాదికి 12 పుస్తకాల వరకు అనుమతి ఉంటుంది. ఒక ఖైదీ తనకున్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటే ఏడాదికి 48 రోజులు తగ్గించుకోవచ్చు. ఇది బ్రెజిల్‌లోని అన్ని జైళ్లలో అమలులో ఉంది. ఈ ప్రోగ్రామ్ ఖైదీల రీహాబిలిటేషన్‌కు మాత్రమే కాకుండా, విద్యా వ్యాప్తికి కూడా ఉపయోగపడుతోంది.
మొదట్లో విమర్శలు
మొదట్లో చాలామంది ‘‘ఖైదీలు పుస్తకాలు చదవడం ఎందుకు? వాళ్ల శిక్షను తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు” అని విమర్శించారు. కానీ, ఫలితాలు చూసి విమర్శించినవాళ్లే ఆశ్చర్యపోయారు. జైలు అధికారులు చెప్పనదాని ప్రకారం.. ఈ ప్రొగ్రామ్ ద్వారా శిక్ష తగ్గించుకున్న ఖైదీల్లో 70 శాతం మంది రీఅఫెండింగ్ రేట్ (మళ్లీ నేరం చేసే అవకాశం) తగ్గింది. ఇప్పటివరకు ఈ ప్రోగ్రామ్‌లో లక్ష మందికిపైగా ఖైదీలు పాల్గొన్నారు. సావో పాలో జైల్లో ఖైదీగా ఉన్న జోస్ మారియో (పేరు మార్చాం) ఐదేండ్ల శిక్షలో 3 నెలలు తగ్గించుకున్నాడు. అతను ‘‘పుస్తకాలు నా మనసును మార్చాయి. బయటికి వెళ్లిన తర్వాత మళ్లీ నేరం చేయను” అంటున్నాడు. ఇలాంటివాళ్లు అక్కడి జైళ్లలో ఎంతోమంది ఉన్నారు.
ఎలా మొదలైంది?
ఈ ఐడియా 2000ల చివరలో జైలు సిస్టమ్‌లోని రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్‌ని మెరుగుపరిచేందుకు మొదలైన చర్చల నుంచి పుట్టింది. అక్కడి జైళ్లలో 8 లక్షల మంది ఖైదీలు ఉన్నారు. ఖైదీల సంఖ్యలో ప్రపంచంలో బ్రెజిల్ మూడో స్థానంలో ఉంది. ఒకప్పుడు జైళ్లు కిక్కిరిసిపోయి ఉండేవి. వైద్యం, విద్యా సౌకర్యాలు కూడా తక్కువే. 2011లో జైలు లైబ్రరీ ప్రోగ్రామ్ ట్రయల్‌లో ఖైదీలు పుస్తకాలు చదివి, రివ్యూస్ రాస్తే వారి మెంటల్ హెల్త్ మెరుగుపడిందని తేలింది. దాని ఆధారంగా 2012లో ఈ చట్టం వచ్చింది.
►ALSO READ | లౌక్యం తెలియని తరానికి.. ఎరుక నేర్పే కవితలు!
