- కల్యాణలక్ష్మి కింద రూ.55.12 కోట్లు అనర్హుల పాలు
- అధికారుల పర్యవేక్షణ లోపంతో రేషన్ బియ్యంలోనూ రూ.135 కోట్ల నష్టం
హైదరాబాద్, వెలుగు: గత ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్ష ణ, సంక్షేమ పథకాల అమలు తీరుపై కాగ్ నివేదిక తీవ్ర అభ్యంతం వ్యక్తం చేసింది. 2022 మార్చి నాటి ముగిసిన కాలానికి సంబంధించి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నివేదికలో కీలక రంగాల్లో జరిగిన లోపాలను కాగ్ ఎండగట్టింది. కల్యాణలక్ష్మి, పౌరసర ఫరాలు, పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన విభాగాల్లో కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్విని యోగమైందని స్పష్టం చేసింది.
నిబంధనల ఉల్లంఘన, అనర్హులకు లబ్ధి, ప్రాజెక్టుల నిర్వహణలో జాప్యం కారణంగా రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం జరిగిందని వెల్లడించింది. సంక్షేమ పథకాల్లో అనర్హులను తొలగించడానికి ఆధార్ అనుసంధానాన్ని పటిష్టం చేయాలని, లబ్ధిదారుల డేటాను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని సూచించింది. అక్రమాలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వృథా అయిన ప్రజాధనాన్ని రికవరీ చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.
పేద ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం అమలులో విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. అధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడం వల్ల ఏకంగా రూ.55.12 కోట్ల నిధులు అనర్హుల పాలయ్యాయని కాగ్ నిర్ధారించింది. ఆడిట్ చేసిన 5,522 కేసుల్లో నిబంధనలకు విరుద్ధంగా వయస్సు తక్కువ ఉన్న వధువులకు, పెళ్లికి ముందే పిల్లలు పుట్టిన వారికి కూడా నగదు పంపిణీ చేశారని తేలింది. ఆదాయ పరిమితి కంటే ఎక్కువ ఉన్నవారు, పథకం అమలులోకి రాకముందే పెళ్లి చేసుకున్నవారు కూడా లబ్ధిపొందడం ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతోంది.
ఆధార్ ధ్రువీకరణలో లోపాలు, ఈ-పాస్ సిస్టమ్‌లో భద్రతా ప్రమాణాలు లేకపోవడం వల్ల ఈ అక్రమాలు జరిగాయిని కాగ్ స్పష్టం చేసింది. రేషన్ బియ్యం పంపిణీలో పర్యవేక్షణ లోపం వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.135 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని తెలిపింది. సుమారు 83,545 మంది అనర్హులు లేదా మరణించిన వారి పేరు మీద బియ్యం డ్రా చేసినట్లు ఆడిట్‌లో గుర్తించారు. ఆదాయపు పన్ను చెల్లించేవారు, 15 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నవారు కూడా రేషన్ కార్డులు కలిగి ఉన్నారని కాగ్ పేర్కొంది.
పారిశ్రామిక వృద్ధి కుంటుపడింది..
టీజీఐఐసీ భూసేకరణలో విఫలమవ్వడం వల్ల పారిశ్రామిక వృద్ధి కుంటుపడిందని కాగ్ తెలిపింది. హడ్కో నుంచి తీసుకున్న రూ.317.49 కోట్ల రుణాన్ని ఉద్దేశించిన ప్రాజెక్టులకు కాకుండా ఇతర అవసరాలకు మళ్లించడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. దీనివల్ల సుమారు రూ.28.05 కోట్ల వడ్డీ భారం అద నంగా పడిందని లెక్కగట్టింది. గచ్చిబౌలి వంటి కీలక ప్రాంతాల్లో పారిశ్రామిక ప్లాట్లను పాత ధరలకే కేటాయించడం వల్ల ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదా య నష్టం జరిగిందని పేర్కొంది.
టీజీఎస్ఆర్టీసీ ప్రవేశ పెట్టిన 'వజ్ర' బస్సుల ప్రాజెక్టు ఘోరంగా విఫలమై రూ.22 కోట్ల నష్టాన్ని మిగిల్చందని వెల్లడించింది. కనీ సం మార్కెట్ సర్వే చేయకుండా, లాభనష్టాలను బేరీజు వేసుకోకుండా బస్సులను కొనుగోలు చేయడం అధికారుల అసమర్థతకు నిదర్శమని మండిపడింది. దీనికి తోడు వడ్డీల రూపంలో మరో రూ.3.99 కోట్ల భారం పడిందని కాగ్ వివరించింది.
