ఆ సింహాలకు సీత, అక్బర్‌‌‌‌ అని ఎందుకు పేర్లు పెట్టారు?

ఆ సింహాలకు సీత, అక్బర్‌‌‌‌ అని ఎందుకు పేర్లు పెట్టారు?

 కోల్‌‌కతా: పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి సఫారీ పార్క్‌‌లో ఉన్న మగ సింహానికి ‘అక్బర్‌‌‌‌’ అని, ఆడ సింహానికి ‘సీత’ అని ఎందుకు పేర్లు పెట్టారని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కలకత్తా హైకోర్టు ప్రశ్నించింది. వెంటనే ఆ రెండు సింహాలకు పేర్లు మార్చాలని ఆదేశించింది. ఇటీవల త్రిపుర నుంచి తీసుకొచ్చిన ఒక మగ, ఒక ఆడ సింహానికి అక్బర్‌‌‌‌, సీత అని పేర్లు పెట్టి.. బెంగాల్‌‌ సఫారీ పార్క్‌‌లో ఒకే ఎన్‌‌క్లోజర్‌‌‌‌లో ఉంచడంతో వివాదం నెలకొంది. దీంతో ఆడ సింహానికి పేరు మార్చాలని కోరుతూ విశ్వ హిందూ పరిషత్‌‌ దాఖలు చేసిన పిటిషన్‌‌ను హైకోర్టు విచారించింది. జస్టిస్‌‌ సౌగత భట్టాచార్యతో కూడిన సింగిల్‌‌ జడ్జి బెంచ్‌‌ స్పందిస్తూ.. ఇలాంటి విషయాల్లో వివాదాలకు దూరంగా ఉండాలని, వెంటనే ఆ సింహాల పేర్లు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ‘‘మీరు సింహానికి హిందూ దేవత, ముస్లిం ప్రవక్త, క్రైస్తవ దేవుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, నోబెల్‌‌ ప్రైజ్‌‌ విన్నర్‌‌‌‌ పేరు పెడతారా? దేశ ప్రజలు ఎంతో గౌరవించే వారి పేర్లను ఎవరైనా ఇలా పెడతారా?” అంటూ జడ్జి ప్రశ్నించారు. 

ప్రభుత్వం తరఫు అడిషనల్ అడ్వకేట్‌‌ జనరల్‌‌ (ఏఏజీ) వాదిస్తూ.. త్రిపుర ప్రభుత్వం సింహాలకు ఆ పేర్లు పెట్టిందని, ప్రస్తుతం వాటి పేర్లను మార్చే ఆలోచనలో ఉందని తెలిపారు. త్రిపుర ప్రభుత్వం పెట్టిన పేర్లను బెంగాల్‌‌ ప్రభుత్వం ఎందుకు మార్చలేదని జడ్జి నిలదీశారు. ‘‘మీది సంక్షేమ రాజ్యం.. సెక్యులర్ రాజ్యం.. అలాంటిది సింహాలకు అక్బర్‌‌‌‌, సీత అని పేర్లు పెట్టి ఎందుకు వివాదాలు స్టార్ట్ చేయాలి.. సింహాలకు ఆ పేర్లు పెట్టడాన్ని నేను సమర్థించను. సింహాలకు ఇదివరకే ఆ పేర్లు ఉంటే వాటిని మార్చండి” అని జడ్జి ఆదేశించారు.