గ్రేటర్ వరంగల్‍కు చేరిన కౌన్సిలర్ల క్యాంప్ రాజకీయం

గ్రేటర్ వరంగల్‍కు చేరిన కౌన్సిలర్ల క్యాంప్ రాజకీయం
  • గ్రేటర్ వరంగల్​లో జనగామ కౌన్సిలర్ల క్యాంప్ రాజకీయం 

వరంగల్/జనగామ, వెలుగు: జనగామ మున్సిపాలిటీ కౌన్సిలర్ల క్యాంప్ రాజకీయం మంగళవారం గ్రేటర్ వరంగల్‍కు చేరింది. మున్సిపాలిటీ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్, ఫ్లోర్ లీడర్ తీరుపై ఆగ్రహంతో ఉన్న 11 మంది కౌన్సిలర్లు ఈ నెల 25న క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశానుసారం జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గడిచిన ఐదారు రోజులుగా వారితో చర్చలు జరిపారు. కాగా, వివాదానికి కారణమైన ముగ్గురిని పదవుల నుంచి తొలగిస్తే తప్ప తమ నిర్ణయం మార్చుకునే ప్రసక్తి లేదని కౌన్సిలర్లు తేల్చి చెప్పారు. ఆ ముగ్గురిపై అవిశ్వాస తీర్మానం కోరుతూ కౌన్సిలర్లు మంగళవారం కలెక్టర్​ను కలిసి లెటర్​అందిస్తారనే ప్రచారం జరిగింది.

జనగామ మున్సిపల్ అసమ్మతి కౌన్సిలర్లు హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో బస చేయడంతో క్యాంప్ రాజకీయం గ్రేటర్ వరంగల్​లో నడిచింది. సోమవారం రాత్రి ఐదుగురు కౌన్సిలర్లు హోటల్ చేరుకుని బస చేయగా.. మంగళవారం ఉదయం మిగతావారు జత కలిశారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బామ్మర్ది డాక్టర్​గుజ్జ సంపత్ రెడ్డి హోటల్​కు చేరుకుని కౌన్సిలర్లతో చర్చలు జరిపారు. వైస్‍ చైర్‍పర్సన్‍, ఫోర్‍ లీడర్‍ ను తొలగించే విషయంలో నిర్ణయం తీసుకోడానికి పార్టీ పెద్దలు ఓకే అన్నప్పటికీ.. చైర్‍ పర్సన్‍ను మార్చే అవకాశం తమ చేతిలో లేదని ఎమ్మెల్యే తరఫున సంపత్‍రెడ్డి చెప్పినట్లు తెలిసింది. కౌన్సిలర్లు అదే పట్టుతో ఉండటంతో.. ‘విషయం.. బావకు చెప్తా’ అంటూ నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు చెబుతున్నారు.