బస్తీలపై నజర్ ! .. స్థానిక నేతలతో క్యాండిడేట్ల చర్చలు

బస్తీలపై నజర్ ! ..  స్థానిక నేతలతో క్యాండిడేట్ల చర్చలు
  • బస్తీలపై నజర్ ! 
  • స్థానిక నేతలతో క్యాండిడేట్ల చర్చలు
  • ప్రత్యర్థులను ఎదుర్కొనే దానిపైనా మంతనాలు
  • ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహం

హైదరాబాద్, వెలుగు : గ్రేటర్​ సిటీలో టికెట్లు కన్ఫర్మ్ అయిన పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. తమ నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలతో పాటు పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. గెలిచేందుకు ఏం చేయాలన్నదానిపై ఫోకస్ పెడుతున్నారు.  ప్రత్యర్థులను ఎలా ఎదుర్కోవాలనే దానిపైనా కేడర్​తో చర్చిస్తున్నారు. అలాగే ఎన్నికల్లో చేసే ఖర్చు పైనా తమ ముఖ్య​అనుచరులతో మంతనాలు చేస్తున్నారు.  ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్​ క్యాండిడేట్లు ఎక్కువగా   బస్తీలపై  ఫోకస్ పెడుతున్నారు. బస్తీల్లోని నేతలను గ్రూపులుగా పిలిపించుకుని స్థానిక సమస్యలు తెలుసుకుంటున్నారు. 

కాలనీలపై ఆసక్తి చూపకుండా.. 

చాలా చోట్ల డబుల్ ​బెడ్రూం ​ఇండ్లు రాలేదని, దళితబంధు, బీసీ బంధు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు అందడం లేదని ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో తమకు సహకరిస్తే గెలిచిన తర్వాత  చూస్తామంటూ హామీలు ఇస్తున్నారు. గ్రేటర్​ సిటీలో 24 నియోజకవర్గాల్లో దాదాపు1,250 స్లమ్ ఏరియాలున్నాయి. ఓల్డ్ సిటీ నియోజకవర్గాలు వదిలేస్తే 17 స్థానాల్లో 16 చోట్ల బీఆర్ఎస్ ​సిట్టింగ్​లే బరిలోకి దిగారు. 

మరోసారి గెలిచేందుకు వారంతా వ్యూహంతో ముందుకెళ్తున్నారు.  ప్రత్యేకించి కాలనీలు, చదువుకున్న వారు అధికంగా ఉండే  ప్రాంతాలపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. వారంతా ఎన్నికల టైమ్​ కు ఎటువైపు మొగ్గు చూపుతారో తెలియక కన్ ఫ్యూజన్ లో ఉన్నారు. మురికివాడలైతే పక్కా ఓటుబ్యాంకుగా మారుతాయని భావిస్తున్నారు. అందుకనుగుణంగానే సనత్​నగర్​, సికింద్రాబాద్, ముషీరాబాద్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కుత్బుల్లాపూర్, కూకట్​పల్లి, శేరిలింగంపల్లి, ఎల్​బీనగర్​, ఉప్పల్, అంబర్​పేట తదితర స్థానాల్లోని బస్తీల ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

స్థానిక నేతలను పిలిపించుకుని.. 

బస్తీల్లోని కీలక వ్యక్తుల ద్వారా పలువురు అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనేలా ఆయా బస్తీల నుంచి జనాలను తరలించే బాధ్యత కూడా వారికే అప్పగిస్తున్నారు. రోజువారీగా డబ్బు, మద్యం, ఫుడ్​ ప్యాకెట్లను పంపిణీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.అలాగే  బస్తీల్లోని ఓటర్లంతా తమ పార్టీకేఓటు వేసేలా ఓటుకు ఎంత ఇవ్వాలన్నదానిపై కూడా పలువురు అభ్యర్థులు స్థానికనేతలతో మంతనాలు చేస్తున్నారు. ఎవరు తమకు ఓటు వేస్తారో, ఎవరు వేయరో అన్నవివరాలను సిద్ధం చేసి అభ్యర్థులకు బస్తీ నేతలుఅందజేస్తున్నారు. మొత్తానికి ఈసారి మద్యం, బిర్యానీ, డబ్బుల పంపిణీ ముమ్మరం చేసేందుకు క్యాండిడేట్లు సిద్ధమవుతున్నారు. 

కాలనీ సంఘాలకు బాధ్యతలు 

కాలనీల ఓటర్లు, చదువుకున్న వారిని ఆకట్టుకునే బాధ్యతలు కాలనీ సంఘాలకు అప్పగించాలని భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల కాలనీ సంఘాలను అభ్యర్థులు సంప్రదిస్తున్నారు. వారిని మంచి చేసుకుని కాలనీ ఓట్లను దక్కించుకోవాలని చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే కాలనీ సమస్యలను చెప్పాలని, వెంటనే వాటిని పరిష్కరిస్తామంటూ వారికి వర్తమానాలు పంపుతున్నారు. మొత్తానికి ఈసారి ఎన్నికల్లో గెలుపొందేందుకు బీఆర్ఎస్​ అభ్యర్థులు అవసరమైన ప్రయత్నాలు, ప్రత్యామ్నాయాలు చేసుకుంటున్నారు.