
నిందితులను రిమాండ్‌కు తరలించాలన్న జస్టిస్ సుమలత
ముగ్గురూ 24 గంటల్లోగా లొంగిపోవాలని ఆదేశం
ఏసీబీ కోర్టు నిర్ణయం సబబు కాదని కామెంట్
కేసు దర్యాప్తుపై స్టే ఇచ్చిన మరో జడ్జి
జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి పంచనామా డ్రాఫ్ట్, సాక్షుల
సంతకాల తేదీల్లో తేడా ఉంది వాస్తవాలు తెలుసుకోవాల్సి ఉందని వెల్లడి
హైదరాబాద్ : ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం హైకోర్టులో మలుపు తిరిగింది. ఈ కేసులో దాఖలైన రెండు వేర్వేరు పిటిషన్లపై హైకోర్టు శనివారం రెండు భిన్న ఉత్తర్వులను జారీ చేసింది. తీవ్రమైన అభియోగాల కేసులో సీఆర్‌పీసీలోని 41ఏ నోటీసు ఇచ్చాకే అరెస్ట్ చేయాలంటూ హైదరాబాద్ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జస్టిస్ చిల్లకూరు సుమలత బెంచ్ రద్దు చేసింది. నిందితులను రిమాండ్‌కు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి బెంచ్.. కేసు దర్యాప్తుపై స్టే విధించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై నమోదైన కేసు దర్యాప్తును నవంబర్ 4వ తేదీకి వాయిదా వేయాలని జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఫామ్‌హౌస్ ఘటన తర్వాత నిర్వహించాల్సిన పంచనామా 26న జరిగితే, ఆ పంచనామాలో సాక్షులు సంతకాలు 27న పెట్టినట్లుగా రిమాండ్ డైరీలో ఉందని పేర్కొన్నారు. ఈ అంశం పరిశీలించిన తర్వాత కేసును లోతుగా విచారణ చేయాలని, వాస్తవాలను తెలుసుకోవాల్సి ఉందని చెప్పారు.
నిందితులను రిమాండ్‌కు తరలించేందుకు...
నిందితులను రిమాండ్‌కు తరలించేందుకు ఏసీబీ కోర్టు జడ్జి నిరాకరించడాన్ని పోలీసులు నవాల్ చేసిన కేసును ముందుగా జడ్జి జస్టిస్ సుమలత విచారించారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు డబ్బు ఎర చూపిన ముగ్గురు నిందితులు 24 గంటల్లోగా సైబరాబాద్ పోలీసుల ఎదుట లొంగిపోవాలని, లేదంటే వారిని పోలీసులు అరెస్టు చేసి సంబంధిత మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చాలని ఆదేశాలు జారీ చేశారు. ఏ1 రామచంద్రభారతి (సతీష్ శర్మ వి.కె), ఏ2 కోరె నందు కుమార్ (నందు), ఏ3 సింహయాజిలను రిమాండ్‌కు తరలించేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించడం సబబుకాదన్నారు. అన్ని కేసుల్లోనూ 41ఏ సీఆర్‌పీసీ నోటీసు ఇవ్వాలని లేదని, అర్నేష్‌కుమార్ కేసులో సుప్రీం కోర్టు విధిగా 41ఏ నోటీసు ఇవ్వాలని చెప్పలేదని తెలిపారు. సీఆర్‌పీసీలోని 41(1)(బి) ప్రకారం దర్యాప్తు అధికారి సంతృప్తి చెందినప్పుడు.. రిమాండ్‌కు మేజిస్ట్రేట్ పంపవచ్చని చెప్పారు. ప్రతివాదుల తరఫున సీనియర్ లాయర్ వేదుల శ్రీనివాస్ వాదిస్తూ.. ‘‘41ఏ సీఆర్‌పీసీ నోటీసు జారీ చేశాకే అరెస్టులు జరగాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులు అమలు కాలేదు. కింది కోర్టు ఉత్తర్వులపై జోక్యం చేసుకునేందుకు ఏమీ లేదు. అరెస్టు చేసే ముందు పోలీసులు 41ఏ సీఆర్‌పీసీ నోటీసు ఇవ్వాల్సిందే” అని నొక్కి చెప్పారు. సింహయాజి తరఫు న్యాయవాది ఉమ్మినేని రామారావు వాదిస్తూ.. 26న ఉదయం 11.30 గంటలకు రోహిత్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఆ సమయానికి ముగ్గురు నిందితులు హైదరాబాద్‌కే రాలేదని చెప్పారు. అయితే వీరి వాదనను జడ్జి తోసిపుచ్చారు. ముగ్గురు నిందితులకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులిచ్చారు.
ఈనెల 4 దాకా ఆపండి: జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి
కేసు దర్యాప్తును సీబీఐ, లేదా సిట్‌తో దర్యాప్తు చేయించాలంటూ బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ జి.ప్రేమేందర్‌రెడ్డి దాఖలు చేసిన కేసును జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారించారు. తొలుత బీజేపీ తరఫు సీనియర్ లాయర్ జె.ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ.. ‘‘జాతీయ స్థాయిలో బీజేపీ ప్రతిష్టకు మచ్చ ఏర్పడేలా కుట్ర జరుగుతున్నది. దీని వెనక కేసీఆర్ పాత్ర ఉంది. వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సీబీఐ, లేదా సిట్‌కు దర్యాప్తునకు ఆదేశాలివ్వాలి” అని కోరారు. రిమాండ్ డైరీలో పంచనామా 26న ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల దాకా జరిగినట్లుగా ఉందని, అందులో మధ్యవర్తుల సంతకాలు మాత్రమే 27న చేసినట్లుగా ఉందని, ఈ ఒక్క ఆధారంతోనే మెయినాబాద్ ఫామ్ హౌస్ కేసును కొట్టేయవచ్చని తెలిపారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచందర్‌రావు వాదనలు వినిపిస్తూ.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులను రిమాండ్‌కు తరలించేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించడాన్ని మరో సింగిల్ జడ్జి తప్పుపట్టారని చెప్పారు. ఇరువర్గాల వాదనలు విన్న జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి.. ‘‘మరో న్యాయమూర్తి ఇచ్చిన ఉత్తర్వులపై మేం స్పందించ బోము. పంచనామా డ్రాఫ్ట్‌ను 26న తయారు చేస్తే.. అం దులో మధ్యవర్తుల (సాక్షుల) సంతకాలు 27న చేసినట్లుగా రిమాండ్ డైరీలో ఉంది. మెయినాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసులో ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేసే దాకా దర్యాప్తు నిలుపుదల చేస్తూ స్టే ఆదేశాలు జారీ చేస్తున్నాం” అని చెప్పారు. పిటిషనర్ స్టే ఉత్తర్వులు కోరనప్పుడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయరాదన్న అభ్యంతరాన్ని తోసిపుచ్చారు. ప్రతివాదులు కౌంటర్ పిటిషన్లు దాఖలు చేశాక వాటిపై నవంబర్ 4న తదుపరి విచారణ చేపడతామని చెప్పారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. ఈలోగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీసుల దర్యాప్తును నిలుపుదల చేస్తున్నామని జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.